చదువుపై ఆసక్తి పెంచాలని కౌన్సెలింగ్
చదువుపై ఆసక్తి పెంచాలని కౌన్సెలింగ్
- బాలికను తల్లికి అప్పగించిన జీఆర్పీ పోలీసులు
కరిమాబాద్, ఆంధ్రప్రభ : చదువు విషయంలో తల్లితో మనస్పర్థలు ఏర్పడి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ యువతిని వరంగల్ జీఆర్పీ పోలీసులు గుర్తించి, కౌన్సెలింగ్ నిర్వహించి ఆమె తల్లికి అప్పగించారు.
హైదరాబాద్‌కు చెందిన జ్యోతి తన కుమార్తె వరుణి (18)తో కలిసి వరంగల్ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా చదువు విషయమై తల్లి–కుమార్తెల మధ్య విభేదాలు తలెత్తడంతో, వరుణి ఎవరికి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆందోళన చెందిన జ్యోతి వరంగల్ జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న జీఆర్పీ సీఐ పి. సురేందర్ ఆదేశాల మేరకు రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎ. వేణు, మహిళా కానిస్టేబుళ్లు ఈ. భార్గవి, కె. ప్రశాంతి యువతి వివరాలు, ఫోన్ నంబర్ సేకరించి సంప్రదించారు. అనంతరం ఆమెను పోలీస్ స్టేషన్‌కు రప్పించి కౌన్సెలింగ్ నిర్వహించారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితిని వివరించిన అనంతరం వరుణిని ఆమె తల్లి జ్యోతికి అప్పగించినట్లు సీఐ సురేందర్ తెలిపారు. యువత, విద్యార్థులు ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల సహాయం తీసుకోవాలని ఆయన సూచించారు.
