అమరజీవి నోముల రామిరెడ్డి ఆశయాలను సాధిద్దాం

ప్రజా పోరాటాల స్ఫూర్తిని కొనసాగించాలి: సీపీఎం నాయకుడు మాటూరి బాలరాజు

వలిగొండ, ఆంధ్రప్రభ : అమరజీవి కామ్రేడ్ నోముల రామిరెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన ఆశయాలు నెరవేరినప్పుడే నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాటూరి బాలరాజు అన్నారు. ఆదివారం వలిగొండ మండల పరిధిలోని సంగెం గ్రామంలో నోముల రామిరెడ్డి 20వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాటూరి బాలరాజుతో పాటు జిల్లా కమిటీ సభ్యుడు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడారు. ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ నోముల రామిరెడ్డి సీపీఎం డివిజన్ నాయకుడు కందాల రంగారెడ్డి సారథ్యంలో సంగెం గ్రామంలో ప్రభుత్వ బంచరాయి, పోరంబోకు భూములను భూమిలేని పేదలు, వివిధ వృత్తిదారులకు పంపిణీ చేయాలని పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహించారని గుర్తు చేశారు. ప్రజా పోరాటాలతో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి పేదలకు భూములు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

సీపీఎం పార్టీ విస్తరణకు ఆయన నిరంతరం కృషి చేశారని, పేదల సమస్యల పరిష్కారం ప్రజా ఉద్యమాల ద్వారానే సాధ్యమనే నమ్మకంతో పోరాటాలు నిర్వహించారని తెలిపారు. వర్కట్‌పల్లి, గోకారం తదితర గ్రామాల్లో పార్టీ బలోపేతానికి అనేక మంది కార్యకర్తలను తీర్చిదిద్దారని చెప్పారు.

ప్రస్తుత ప్రభుత్వాల విధానాలపై కూడా నోముల రామిరెడ్డి స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నోముల జంగారెడ్డి, మండల కమిటీ సభ్యులు కవిడే సురేష్, భీమనబోయిన జంగయ్య, మాజీ సర్పంచ్ కాసుల కృష్ణ, అంగిడి దేవేందర్ రెడ్డి, ఏనుగు ప్రభాకర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు తాడూరి లింగస్వామి, కోలన్ రామిరెడ్డి, మంద నరసింహ, జక్కుల వెంకటేష్, ఉండ్రాటి వెంకటేష్, నోముల మహేందర్ రెడ్డి, రామిరెడ్డి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.