కలిసికట్టుగా ముందుకు సాగుదాం..
జిల్లా అభివృద్ధిలో భాగస్వాములం అవుదాం
మంత్రి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం జగిత్యాల జిల్లా చల్గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయానికి భూమి కేటాయింపు సవాలుగా మారినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో మంత్రివర్గంలో తీర్మానం చేసి ఐదు ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కావడం సంతోషకరమని, జిల్లా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసిరావాలని కోరారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయానికి భూమి కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల కేంద్రీయ విద్యాలయంలో 50 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు, మిగిలిన 50 శాతం సీట్లు త్రివిధ దళాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కేటాయిస్తామని వెల్లడించారు.
వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేద విద్యార్థుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తున్నామని తెలిపారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తూ తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని చల్గల్లో కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించినట్లు తెలిపారు. వ్యవసాయం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు.
