రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి

వలిగొండ, ఆంధ్రప్రభ: ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు ఎలాంటి కొరత లేకుండా సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. ఆదివారం వలిగొండ మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువులు, విత్తనాల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, యూరియా, డి.ఏ.పీ.తో పాటు ఇతర ఎరువుల నిల్వలు, ఇప్పటివరకు జరిగిన విక్రయాల వివరాలను దుకాణ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతులు నేరుగా కొనుగోలు చేస్తున్నారా లేదా ఫర్టిలైజర్ యాప్‌లో నమోదు చేసుకున్న వారికి మాత్రమే విక్రయాలు జరుగుతున్నాయా అనే అంశాన్ని స్వయంగా ఫర్టిలైజర్ యాప్‌లో పరిశీలించి ధృవీకరించారు. ఎరువుల విక్రయాల్లో పూర్తి పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

ఈ సందర్భంగా ఖరీఫ్‌లో ఏ పంటలకు అధికంగా విత్తనాలు కొనుగోలు చేస్తున్నారో తెలుసుకున్న కలెక్టర్, వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నీనో ప్రభావం దృష్ట్యా వరికి బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల పత్తి, కందులు తదితర ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. యూరియా కొనుగోలు కోసం రైతులు మీ సేవ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉండేలా నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, కృత్రిమ కొరత లేదా అక్రమ నిల్వలు జరగకుండా నిరంతరం తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో వలిగొండ తహసీల్దార్ దశరథ నాయక్, మండల వ్యవసాయ అధికారి అంజలి దేవి తదితరులు పాల్గొన్నారు.