ప్రతి ఓటరుకు అవగాహన కల్పించాలి

సర్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: చల్మెడ లక్ష్మీనరసింహారావు

వేములవాడ, ఆంధ్రప్రభ : కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంపై ప్రతి ఓటరికి అవగాహన కల్పించాలని బీఆర్‌ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు పిలుపునిచ్చారు.

ఆదివారం వేములవాడ రూరల్ మండలంలోని నాగయ్యపల్లె, మర్రిపల్లి, జయవరం, మల్లారం, హనుమాజీపేట, బొల్లారం, లింగంపల్లి గ్రామాల్లో పోలింగ్ బూత్ ఏజెంట్లు, పార్టీ సభ్యులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితా, నమోదు ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.

సర్ కార్యక్రమంపై అప్రమత్తంగా ఉండి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా బూత్ లెవెల్ అధికారులతో సమన్వయంగా పనిచేయాలని కోరారు. ఓటర్ల జాబితా స్వచ్ఛంగా, ఖచ్చితంగా ఉండేందుకు పార్టీ కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.

ఈ సమావేశాల్లో మండల సీనియర్ నాయకులు ఆకుల దేవరాజ్యం, గోస్కుల రవి, పోశెట్టిపల్లి మధు, మండల సర్పంచులు, కార్యకర్తలు, బూత్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.