Archery | ఆర్చరీలో భారత మహిళలకు రజతం..

జ్యోతి సురేఖకు సీఎం చంద్రబాబు అభినందనలు
ప్రపంచకప్‌లో మెరిసిన భారత మహిళల జట్టు..
ఏపీకి చెందిన జ్యోతి సురేఖపై ప్రత్యేక ప్రశంసలు వెల్లువెత్తించిన సీఎం

Archery | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : మాడ్రిడ్‌లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ నాలుగో దశ పోటీల్లో మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకం సాధించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జ్యోతి సురేఖ వెన్నం, పృథిక ప్రదీప్, చికిత్సా తానిపర్తి సభ్యులుగా ఉన్న భారత జట్టుకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి సురేఖ వెన్నం అంతర్జాతీయ వేదికపై మరోసారి తన ప్రతిభను చాటుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు. ఆమె సాధిస్తున్న విజయాలు రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు. ఏపెక్స్–2036 కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి తీసుకొచ్చే మరెంతో మంది ఛాంపియన్ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా ఇదే జోరును కొనసాగిస్తూ మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తూ భారత మహిళల జట్టుకు మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.