జేఈఈ అడ్వాన్స్‌లో ప్రతిభ చాటిన విద్యార్ధికి ఘన సన్మానం

ఇల్లెందు, ఆంధ్రప్రభ : జేఈఈ అడ్వాన్స్‌డ్-2026లో జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 382వ ర్యాంకు, ఎస్‌టీ కేటగిరీలో 4వ ర్యాంకు సాధించి దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ) విభాగంలో సీటు సాధించిన మోకాళ్ల చరత్ చంద్రను టీఎస్ ఏటీఎఫ్, ఆదివాసీ హెల్ప్‌లైన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఇల్లెందు మండలం కొమరం భీం కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో చరత్ చంద్రతో పాటు ఆయన తల్లిదండ్రులు మోకాళ్ల మోహనరావు, స్వరూప దంపతులను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఎస్ ఏటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మోకాళ్ల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కబ్బాకుల రవి మాట్లాడుతూ, భారతదేశంలో అత్యుత్తమ విద్యాసంస్థలలో ఒకటైన ఐఐటీ ముంబైలో సీఎస్‌ఈ సీటు సాధించడం గొప్ప విజయమని కొనియాడారు. దేశవ్యాప్తంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మాత్రమే ఐఐటీ ముంబైలో ప్రవేశం లభిస్తుందని, అలాంటి సంస్థలో ఆదివాసీ మన్యం ప్రాంతానికి చెందిన విద్యార్థి ప్రవేశం పొందడం గర్వకారణమని అన్నారు.

చరత్ చంద్ర ఆదివాసీ సమాజానికి ఆణిముత్యంలా నిలిచాడని, అతని విజయం మొత్తం ఆదివాసీ జాతికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ స్థాయి విజయాన్ని సాధించడంలో చరత్ చంద్ర కృషితో పాటు ఆయన తల్లిదండ్రుల ప్రోత్సాహం, త్యాగం కూడా కీలక పాత్ర పోషించాయని అన్నారు.

భవిష్యత్తులో చరత్ చంద్ర మరింత ఉన్నత స్థాయికి ఎదిగి సివిల్స్ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల్లోనూ విజయం సాధించి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఆదివాసీ సమాజానికి చెందిన విద్యార్థులు, యువత చరత్ చంద్రను ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. అనంతరం టీఎస్ ఏటీఎఫ్ ప్రతినిధులు చరత్ చంద్రను శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

కార్యక్రమంలో మోకాళ్ల శ్రీనివాసరావు, రాధ దంపతులు, కబ్బాకుల రవి, కుంజ కృష్ణ, ఉండం నాగేంద్రరావు, ఊకె కృష్ణ-రామేశ్వరి, కోడెం కృష్ణ స్వరూప, తోలెం ఈశ్వర్, మోకాళ్ల కృష్ణార్జునరావు, గల్లిగా రాంబాబు, గీతపల్లి కృష్ణ, చుంచు రవీందర్, కల్తి రామకృష్ణ, ఈసాల రాంబాబు, ఊకె పోచలయ్య, పాయం సర్వేశ్వరరావు, గుంపిడి చుక్కయ్య, కోర్స రాజేష్, సూర్నబాక వీరస్వామి, మోకాళ్ల భానుప్రసాద్, మోకాళ్ల సంజన, మోకాళ్ల అమ్ములు తదితరులు పాల్గొన్నారు.