Governor | అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్
Governor | అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్
Governor | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు గందరగోళ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో వందేమాతరం పాడటానికి డీఎంకే ప్రభుత్వం ఇష్టపడకపోవడంతో గవర్నర్ ఆర్.ఎన్.రవి ప్రసంగించకుండానే వెనుదిరిగారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా గవర్నర్ మాట్లాడుతుండగా అధికార డీఎంకే సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలు చేయడం, పదే పదే గవర్నర్ మైక్ కట్ చేయడంతో ఆయన సభ నుంచి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడానికి 13 ప్రధాన కారణాలను వివరిస్తూ లోక్ భవన్ అధికారికంగా ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది.
ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగంలో అనేక అవాస్తవాలు ఉన్నాయని, ప్రజలను వేధిస్తున్న కీలక సమస్యలను ప్రభుత్వం కావాలనే విస్మరించిందని గవర్నర్ ఆరోపించారు. ముఖ్యంగా తన మైక్‌ను పదేపదే స్విచ్ ఆఫ్ చేయడం, మాట్లాడనీయకుండా అడ్డుకోవడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక విఫలాలను గవర్నర్ తన నివేదికలో ఎండగట్టారు. రాష్ట్రంలో మహిళా భద్రతను పూర్తిగా గాలికొదిలేశారని, పోక్సో (POCSO) అత్యాచార కేసులు 55 శాతం, లైంగిక వేధింపుల కేసులు 33 శాతం పెరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
అలాగే, మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఏడాదికి సుమారు 2000 మంది యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, దీనిపై ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ఏడాదికి 20,000 ఆత్మహత్యలు జరుగుతున్నాయని, రోజుకు సగటున 65 మంది బలవన్మరణానికి పాల్పడుతుండటంతో తమిళనాడు భారతదేశ ఆత్మహత్యల రాజధానిగా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కాని పక్షంలో, రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తతకు గురయ్యే అవకాశముంది.
