జగనన్న కాలనీలో కబ్జాల వెనుక అసలు విషయం ఏమిటి..?

జగనన్న కాలనీలో కబ్జాల వెనుక అసలు విషయం ఏమిటి..?

అనర్హ పట్టాలపై కొనసాగుతున్న వివాదం

మంత్రాలయం, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని సూగూరు, ఎమ్మిగనూరు రోడ్డులో ఉన్న జగనన్న కాలనీలో ఆక్రమణలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సర్వే నెంబర్లు 271/3, 272/1, 272/4, 274/1 పరిధిలో 11 ఎకరాలు 12 సెంట్లలో మొత్తం 446 ప్లాట్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం. అలాగే సూగూరు రోడ్డులోని సర్వే నంబరు 335/1లో 4.89 ఎకరాల్లో 195 ప్లాట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.

గత వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో గూడులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించి పట్టాలు జారీ చేశారు. అయితే అర్హులతో పాటు అనర్హులకు కూడా పట్టాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని “పొజిషన్ పట్టాలు” కూడా రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకుండానే జారీ చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కొంతమంది లబ్ధిదారులు ఇప్పటివరకు ఇళ్ల నిర్మాణం చేపట్టకపోగా, మరికొందరు ప్లాట్లను అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు రాళ్లు, బండలు పెట్టి తమవే ప్లాట్లు అని పేర్కొంటున్న పరిస్థితి ఉన్నట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై సీపీఎం నాయకులు ఆదోని సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించి అర్హులైన వారికి కొత్తగా పట్టాలు ఇవ్వాలని వారు కోరారు. దీంతో సబ్ కలెక్టర్ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మంత్రాలయం తహసీల్దార్‌ను ఆదేశించారు.

అయితే ఈ విచారణ పురోగతి స్పష్టంగా తెలియడం లేదని పేర్కొంటున్నారు. కొంతమంది లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు స్టే ఇచ్చినట్లు సమాచారం.

పొజిషన్ పట్టాలు చెల్లవని తెలిసినా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగనన్న కాలనీలో అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోవడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply