ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం

గంపలగూడెం, ఆంధ్రప్రభ : విద్యార్థులు సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని, సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై జి. అనిల్ సూచించారు.మండలంలోని పెద్దకొమిర గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల కోసం సైబర్ క్రైమ్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జి. అనిల్, శశిధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు సైబర్ భద్రతపై విలువైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఎస్సై జి. అనిల్ మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా అధికమవుతున్నాయని తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, లక్కీ డ్రాలు, తక్కువ ధరలకు వస్తువులు అందిస్తామంటూ వచ్చే నకిలీ ప్రకటనలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా విద్యార్థినులు సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు, ఫోటోలు పంచుకునే విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.శశిధర్ మాట్లాడుతూ, ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు కోల్పోతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. బాధితులు ఎంత త్వరగా స్పందిస్తే, పోగొట్టుకున్న సొమ్మును తిరిగి పొందే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని వివరించారు. అలాగే ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, పోలీసు సిబ్బంది, విద్యార్థినులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.