Gold Price | ప‌డిపోయిన బంగారం, వెండి ధ‌ర‌లు

Gold Price | ప‌డిపోయిన బంగారం, వెండి ధ‌ర‌లు

ఒక్కరోజే తులం బంగారం రూ.3,650 పతనం!
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో కుప్పకూలిన బంగారం ధరలు
వెండి ధరలోనూ భారీ పతనం..
రెండు రోజుల్లో కిలోకు రూ.20 వేల తగ్గుదల

Gold Price |హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలతో ఆందోళన చెందిన కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చిన ప్రభావం దేశీయ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర ఏకంగా రూ.3,650 మేర పడిపోగా, వెండి ధర కూడా భారీగా తగ్గింది. దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనుకూల సమయంగా మారింది. బంగారం, వెండి ధరల్లో తాజా తగ్గుదలతో నగల కొనుగోలు చేయాలనుకునే వారు మార్కెట్ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. అయితే అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, డాలర్ కదలికలు, కేంద్ర బ్యాంకుల విధానాలు తదితర అంశాల ప్రభావంతో ధరల్లో మళ్లీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో..
ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 72 డాలర్ల మేర పడిపోవడంతో పసిడి విలువ 4,155 డాలర్ల స్థాయికి చేరింది. అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, డాలర్ బలపడటం వంటి కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదేవిధంగా స్పాట్ సిల్వర్ ధర కూడా 2.02 శాతం మేర తగ్గి ఔన్సుకు 64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

హైదరాబాద్‌లో బంగారం తాజా ధరలు

24 క్యారెట్ల బంగారం
10 గ్రాముల ధర: రూ.1,45,860
తగ్గుదల: రూ.3,650
22 క్యారెట్ల బంగారం
10 గ్రాముల ధర: రూ.1,33,700
తగ్గుదల: రూ.3,350

18 క్యారెట్ల బంగారం
10 గ్రాముల ధర: రూ.1,09,390
తగ్గుదల: రూ.2,740

వెండి ధరలో భారీ పతనం
బంగారం బాటలోనే వెండి ధర కూడా భారీగా తగ్గింది. శుక్రవారం ఒక్కరోజే కిలో వెండి ధర రూ.15,000 మేర క్షీణించింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,55,000 వద్దకు చేరింది. ముఖ్యంగా గత రెండు రోజుల్లోనే వెండి ధర దాదాపు రూ.20,000 మేర తగ్గడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.