ఉట్నూర్‌లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఉట్నూర్, ఆంధ్రప్రభ : భారతదేశానికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సేవలు ఎంతో అవసరమని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.

రాహుల్ గాంధీ 56వ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉట్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం నాయకులు ఒకరికొకరు కేక్ తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, దేశంలో జరుగుతున్న పరిణామాలపై రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో అహర్నిశలు పోరాడుతున్న తీరును ప్రజలు రోజూ మీడియా, పత్రికల ద్వారా గమనిస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం గళం విప్పుతూ దేశ ప్రజల తరఫున పోరాడుతున్న నాయకుడిగా రాహుల్ గాంధీ నిలిచారని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు, మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నామని తెలిపారు. దేశ రక్షణ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయనకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు, ప్రజల తరఫున రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ దాసండ్ల ప్రభాకర్, ఆర్టీఏ సభ్యుడు దూట రాజేశ్వర్, డీసీసీ ఉపాధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్, సహకార సంఘం చైర్మన్ సామా ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రాధాబాయి, మాజీ సర్పంచ్ మరసుకోల తిరుపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్తపల్లి మహేందర్, బిరుదుల లాజర్, అచ్చ దేవానంద్, అన్సర్ అలీతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.