రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ పోటీల్లో బంగారు పతకం
డౌన్ సిండ్రోమ్ బాలుడు రావు శ్రీకృష్ణదేవరాయలను అభినందించిన సీఐ
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ: రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ పోటీల్లో ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించిన డౌన్ సిండ్రోమ్ బాలుడు రావు శ్రీకృష్ణదేవరాయలను చిలకలూరిపేట పట్టణ సీఐ పి. రమేష్‌బాబు అభినందించారు.
తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని శ్రీవత్స కన్వెన్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ, కరాటే, తైక్వాండో పోటీల్లో చిలకలూరిపేటకు చెందిన షావోలిన్ ఊషు ఆర్గనైజేషన్ గ్రాండ్ మాస్టర్ కమాల్ భాషా ఆధ్వర్యంలో పాల్గొన్న శ్రీకృష్ణదేవరాయలు (బ్లాక్ బెల్ట్) కటా విభాగంలో ప్రత్యేక ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించాడు.
ఈ సందర్భంగా చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ పి. రమేష్‌బాబు శ్రీకృష్ణదేవరాయలుకు గోల్డ్ మెడల్‌ను ధరింపజేసి అభినందించారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను సమాజం ప్రోత్సహించి, వారి ప్రతిభను వెలికితీయడానికి అందరూ అండగా నిలవాలని ఆయన అన్నారు.
ఈ పోటీల్లో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఏపీఐడీసీ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ పాల్గొని శ్రీకృష్ణదేవరాయలుకు బంగారు పతకాన్ని ప్రదానం చేశారు. రాష్ట్రస్థాయిలో చిలకలూరిపేటకు చెందిన క్రీడాకారుడు ఈ ఘనత సాధించడం పట్టణానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు.
మదర్ థెరిసా సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపకులు గ్రాండ్ మాస్టర్ టి. అబ్బులు, వైవీఎన్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించగా, కార్యక్రమంలో నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
