వరుస దొంగతనాల కేసును ఛేదించిన పోలీసులు

వరుస దొంగతనాల కేసును ఛేదించిన పోలీసులు

  • మహిళా నిందితురాలు అరెస్ట్

నరసన్నపేట, ఆంధ్రప్రభ: సారువకోట పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా వరుస చోరీలకు పాల్పడుతున్న మహిళా నిందితురాలిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సోమవారం నరసన్నపేట సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో టెక్కలి డీఎస్పీ డి. లక్ష్మణరావు ఈ కేసు వివరాలను వెల్లడించారు. నిందితురాలి నుంచి సుమారు 22 తులాల బంగారం, 8 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

బుడిది జంక్షన్ వద్ద పట్టుబడ్డ నిందితురాలు
సారవకోట మండలం భైదలాపురం గ్రామానికి చెందిన ముద్దాడ లక్ష్మి అనే మహిళ ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలు ప్రస్తుతం తన కుటుంబంతో విశాఖపట్నంలో నివసిస్తూ, పండుగలు లేదా శుభకార్యాల సమయంలో తన సొంత గ్రామానికి లేదా అత్తవారి ఊరైన అవలంగికి వస్తూ దొంగతనాలకు పాల్పడుతోంది. సోమవారం ఉదయం బుడిది జంక్షన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, దొంగిలించిన నగలను విక్రయించడానికి తీసుకువెళ్తూ లక్ష్మి పట్టుబడింది.

మార్చి 6 అవలంగి గ్రామానికి చెందిన ముద్దాడ గౌరి నాయుడు ఇంటి తాళాలు వేసి ఉండటాన్ని గమనించి, లోపలికి ప్రవేశించి కప్బోర్డులోని 13 తులాల బంగారం, 8 తులాల వెండి మొలతాడులను అపహరించింది. ఏప్రిల్ 20 రాత్రి సమయంలో యాళ్ల రాము ఇంటి వరండాలో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా, యాళ్ల పావని మరియు యాళ్ల శకుంతల మెడలోని సుమారు 5 తులాల బంగారు పుస్తెల తాడులను దొంగిలించింది. ఏప్రిల్ 26 గుండ బోడేసు ఇంటిలో నిద్రిస్తున్న లక్ష్మీనారాయణ మెడలోని 2.5 తులాల బంగారు పుస్తెల తాడును అపహరించింది.

నిందితురాలి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తి విలువ సుమారు 35 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన నరసన్నపేట సీఐ మరదాన శ్రీనివాసరావు, సారవకోట ఎస్సై బి. అనిల్ కుమార్, జలుమూరు, పోలాకి ఎస్సైలు మరియు ఇతర పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply