నిర్లక్ష్యం నీడలో గోడిసిర్యాల గోండుగూడ గ్రామపంచాయతీ
నిర్లక్ష్యం నీడలో గోడిసిర్యాల గోండుగూడ గ్రామపంచాయతీ
దస్తూరాబాద్, ఆంధ్రప్రభ:
నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని గోడిసిర్యాల గోండుగూడ గ్రామపంచాయతీలో మురుగునీరు రోడ్డుపై పారుతున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రజలు నడిచే రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తున్నా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో దోమలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మున్యాల గోండుగూడలో బోరింగ్ నీరు ఇంకేందుకు రోడ్డు పక్కన ఇంకుడు గుంత నిర్మాణం కోసం ఆరు అడుగుల గుంత తవ్వి, పనులు పూర్తి చేయకుండా వదిలేశారని గ్రామస్థులు తెలిపారు. ఆ మార్గంలో వెళ్లే ప్రజలు కాలు జారి పడే ప్రమాదం ఉందని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆ గుంత నిర్మాణాన్ని పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. రోడ్డుకి ఇరువైపులా చెత్త పేరుకుపోయినా గ్రామపంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
గ్రామంలో ఎప్పటికప్పుడు చెత్త సేకరణ చేపట్టి, మురుగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

