కవ్వాల్ టైగర్ రిజర్వులో పీసీసీఎఫ్ పర్యటన

భర్తన్‌పేట వాచ్‌టవర్, ఈసీ సెంటర్ పరిశీలన

అటవీ పర్యాటక నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు

జన్నారం, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌కు చెందిన ప్రధాన అటవీ సంరక్షణాధికారి (పీసీసీఎఫ్) వినయ్ కుమార్ మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో జన్నారం అటవీ డివిజన్‌లోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ముందుగా ఇందన్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని భర్తన్‌పేట వాచ్‌టవర్‌ను సందర్శించి అక్కడి నుంచి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం జన్నారంలోని ఎకో టూరిజం (ఈసీ) సెంటర్‌ను సందర్శించి అక్కడి నిర్వహణ తీరును సమీక్షించారు.

ఈ సందర్భంగా ఈసీ సెంటర్‌లో సందర్శకుల భద్రతకు అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించాలని, ప్రవేశ రుసుము తప్పనిసరిగా వసూలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకుముందు స్థానిక అటవీ అధికారులు పీసీసీఎఫ్‌కు గౌరవ వందనం సమర్పించారు. ఈ పర్యటనలో మంచిర్యాల సీసీఎఫ్ శాంతారాం, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్, ఎఫ్‌డీవో రామ్మోహన్, రేంజ్ అధికారులు బాబా ఖాదర్ వలీ, లక్ష్మీనారాయణ, వికాస్ తదితరులు పాల్గొన్నారు.