భద్రాచలం–వాజేడు రహదారికి మోక్షం కల్పించండి
వారం రోజుల్లో పనులు ప్రారంభం కాకపోతే కాంట్రాక్టర్‌ను మార్చాలి: మంత్రి తుమ్మల
వాజేడు, ఆంధ్రప్రభ: భద్రాచలం నుంచి వాజేడు వరకు అధ్వాన్నంగా మారిన రహదారికి తక్షణమే మోక్షం కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రోడ్లు–భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిని కోరారు.
బుధవారం ఈ మార్గంలో ప్రయాణించిన సందర్భంగా రహదారి దుస్థితిని చూసిన స్థానికులు మంత్రిని అడ్డుకుని తమ సమస్యలను వివరించారు. గతంలో మీరు ఆర్‌అండ్‌బీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రహదారి నిర్మాణం జరిగిందని, అనంతరం ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 100 కిలోమీటర్ల ప్రయాణానికే మూడు గంటల సమయం పడుతోందని, ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
ప్రజల సమస్యలను విన్న వెంటనే స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి, సంబంధిత అధికారులకు, తెలంగాణ ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. రహదారి మరమ్మతులు, అభివృద్ధి పనులను అత్యవసరంగా ప్రారంభించి ప్రజల కష్టాలకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. వారం రోజుల్లో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటానని మంత్రి తుమ్మల స్థానికులకు హామీ ఇవ్వడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రహదారి అభివృద్ధి పనులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు లభించినప్పటికీ కాంట్రాక్టర్ ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడం ఆందోళనకరమని మంత్రి జనార్దన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వారం రోజుల్లోగా పనులు ప్రారంభం కాకపోతే ప్రస్తుత కాంట్రాక్టర్‌ను తొలగించి, కొత్త టెండర్లు పిలిచి పనులను వేగవంతం చేయాలని కోరారు. దీనిపై మంత్రి జనార్దన్‌రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
భద్రాచలం–వాజేడు రహదారి అభివృద్ధి పనులు మొత్తం మూడు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు. భద్రాచలం నుంచి ఏటపాక వరకు ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 7.8 కిలోమీటర్ల రహదారిని రూ.3.70 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఏటపాక నుంచి చర్ల మండలంలోని సుబ్బంపేట వరకు 56.8 కిలోమీటర్ల మేర భద్రాద్రి డివిజన్ పరిధిలో రూ.67.58 కోట్లతో పనులు చేపట్టనున్నారు. సుబ్బంపేట నుంచి వాజేడు వరకు ములుగు డివిజన్ పరిధిలోని 48 కిలోమీటర్ల రహదారిని రూ.44 కోట్లతో నిర్మించనున్నారు. మొత్తం 112.6 కిలోమీటర్ల పొడవున సుమారు రూ.115.28 కోట్ల వ్యయంతో ఈ రహదారి అభివృద్ధి కానుంది.
ఈ పనులను ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరెడ్డి, తెలంగాణ చీఫ్ ఇంజినీర్ బీవీ రావు పర్యవేక్షించనుండగా, భద్రాచలం, ములుగు ఈఈలు క్షేత్రస్థాయిలో అమలును పర్యవేక్షించనున్నారు. ముఖ్యంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులు రహదారి దుస్థితి కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల అధికారులను కోరారు.
