ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు పనులకు తాత్కాలిక బ్రేక్

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు పనులకు తాత్కాలిక బ్రేక్

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ :
విజయవాడలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు, వడగాల్పుల ప్రభావంతో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని దేవస్థానం, ఆర్ అండ్ బీ శాఖలు నిర్ణయించాయి.

భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఘాట్ రోడ్డు మరమ్మతు, ఆధునీకరణ పనులు వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం వాయిదా వేయబడ్డాయి. మే 29 ఉదయం నుంచి ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు యథావిధిగా అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డు ఆధునీకరణ పనులు మే 26 నుంచి ప్రారంభమయ్యాయి. టోల్ గేట్ నుంచి కొండపై వరకు బిటుమిన్ పనులు, మరమ్మతులు చేపట్టి జూన్ 12 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అయితే అధిక ఉష్ణోగ్రతల కారణంగా బిటుమిన్ పనులు నాణ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉందని, రోడ్డుపై పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని ఆర్ అండ్ బీ అధికారులు దేవస్థానానికి నివేదించారు.

వేసవి తీవ్రతలో కార్మికులు పని చేయడం కూడా కష్టతరంగా మారడంతో, వాతావరణం అనుకూలించిన తర్వాత శాశ్వత ఆధునీకరణ పనులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు.

ప్రస్తుతం భక్తులకు ఇబ్బందులు లేకుండా తాత్కాలికంగా రహదారిని వినియోగానికి అనువుగా మార్చినట్లు అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు సాధారణమయ్యాక కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించారు.