సింగరేణిలో బొగ్గు నిల్వలపై సీబీఐ విచారణ జరపాలి

సింగరేణిలో బొగ్గు నిల్వలపై సీబీఐ విచారణ జరపాలి

  • టీబీజీకేఎస్ డిమాండ్

గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి సంస్థలో బొగ్గు నిల్వలపై యజమాన్యం చెబుతున్న తప్పుడు లెక్కల పైన సిబిఐ విచారణ జరపాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి డిమాండ్ చేశారు. గురువారం రామగుండం రీజియన్ లోని పలు బొగ్గు గనుల పైన ఉన్న బొగ్గు నిల్వలను టీబీజీకేఎస్ బృందం పరిశీలించింది. యాజమాన్యం ప్రకటించిన విధంగా బొగ్గు నిల్వలు లేవని, కోల్ డంపింగ్ యార్డ్ ఖాళీగా కనబడుతున్నాయని అన్నారు. రామగుండం ఓసిపి 5వ గనిలో అత్యధికంగా బొగ్గు నిలువలు ఉన్నాయని యాజమాన్యం చెబుతున్నప్పటికీ వాటిని సందర్శించడానికి మాత్రం అనుమతించడం లేదన్నారు.

సదరు ఓపెన్ కాస్ట్ లో సుమారు మూడున్నర లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని అధికారులు పేర్కొంటుండగా అయితే అక్కడ వాస్తవంగా బొగ్గు నిల్వలు 40 వేల టన్నులకు నుంచి లేవని రామ్మూర్తి స్పష్టం చేస్తున్నారు. బొగ్గు నిల్వచేసే ప్రాంతాలలో షేల్ బొగ్గు, బండలు, కాలిపోయిన బొగ్గు బూడిద మాత్రమే దర్శనమిస్తున్నాయన్నారు. రామగుండం బొగ్గు నిల్వలు లేవని తమ పరిశీలనలోనూ అందిన సమాచారం ప్రకారం తెలుస్తుందని వెల్లడించారు.

బొగ్గు నిలువల తనిఖీ కోసం టీబీజీకేఎస్ బృందాన్ని అనుమతించకపోవడం అంటేనే బొగ్గు నిలువలు లేవని అంగీకరించడం అని ఆయన పేర్కొన్నారు. రామగుండం డివిజన్ వన్ లో బొగ్గు నిలువలు పేరుకుపోయినట్లయితే బొగ్గు రవాణా ఎందుకు తగ్గుతున్నదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రామగుండం డివిజన్ వన్ బొగ్గు ఉత్పత్తిలో సింహభాగం ఓసిపి 5వ గనిదే, అలాంటప్పుడు బొగ్గు రవాణా ఎందుకు జరగటం లేదని, ఇది అనేక అనుమానాలకు కారణమని కూడా వివరించారు. ఆయన వెంట టీబీజీకేఎస్ ఆర్ జీ-1 ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్, కేంద్ర కమిటీ నాయకులు పోలాడి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.