చెట్టు పడి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే
చెట్టు పడి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే
బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ
కృష్ణలంక, ఆంధ్రప్రభ: తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్ రామలింగేశ్వరనగర్ కరకట్ట కాలువ రోడ్డులో మంగళవారం వీచిన ఈదురుగాలులు, వర్షానికి చెట్టు కూలి ఇళ్లపై పడిన ఘటనాస్థలాన్ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ బుధవారం పరిశీలించారు.
కార్పొరేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే, చెట్టు పడటంతో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. బాధితులను అడిగి ప్రమాదం జరిగిన విధానం, జరిగిన నష్టం వివరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ.. ఈదురుగాలులు, వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న చెట్లను స్థానికులు గుర్తించి తన దృష్టికి తీసుకువస్తే, వాటి వద్ద రక్షణ చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశిస్తానని తెలిపారు.
కార్పొరేషన్ అధికారులు కూడా ప్రమాదకరంగా ఉన్న చెట్లను గుర్తించి ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. చెట్టు పడి దెబ్బతిన్న ఇళ్ల యజమానులకు ప్రభుత్వ పరంగా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
వర్షాలు పడుతున్న సమయంలో ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాలని గద్దె రామమోహన్ సూచించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గాదిరెడ్డి అమ్ములు, కెల్లా రమేష్ నాయుడు, సుబ్రహ్మణ్యం, నరసింహారావు, సత్యనారాయణ, వీఆర్వో హసీనా బేగం తదితరులు పాల్గొన్నారు.
