మాల్టాలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాల వాసి మృతి
- పెళ్లయిన ఐదు నెలలకే విషాదం..
- ప్రమాదంలో 27 ఏళ్ల యువకుడు మృతి
జగిత్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : యూరప్‌లోని మాల్టాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల పట్టణానికి చెందిన జావీద్ అబ్దుల్లా (27) మృతి చెందాడు. మంగళవారం ఉదయం ఖోర్మి పట్టణంలోని త్రిక్ తల్-హండాక్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. జావీద్ నడుపుతున్న టయోటా టోయేస్ వాహనం లారీని ఢీకొట్టినట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న వెంటనే సివిల్ ప్రొటెక్షన్ సిబ్బంది, వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే అప్పటికే జావీద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జావీద్ మాల్టాలోని పావోలా ప్రాంతంలో నివసిస్తున్నట్లు సమాచారం. ఆయనకు గత మార్చిలోనే వివాహం జరిగింది. తాజాగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలియడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
