అర్హులందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి
హామీ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. సీపీఐ నేత పోకల డిమాండ్
గరిడేపల్లి, ఆంధ్రప్రభ: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వృద్ధులు, ఇతర లబ్ధిదారులందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సీపీఐ గరిడేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం ఎంపీడీవో సరోజనకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పోకల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడో ఏడాది కొనసాగుతున్నా కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోవడం సరికాదన్నారు. అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. పెన్షన్ మొత్తాన్ని రెట్టింపు చేస్తామన్న హామీని కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి త్రిపురం సుధాకర్‌రెడ్డి, నాయకులు ఎడ్ల అంజిరెడ్డి, తిరగమల్ల కిరణ్, చెవ్వా వెంకన్న, జోన్లగడ్డ తిరుపయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.
