ఆలోచన మార్చుకున్నాం.. అభివృద్ది వైపు అడుగు వేస్తాం
- భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించిన పలాస ప్రాంత రైతులు
- స్థానిక రైతులు, ఉద్యోగస్తులు, ఎయిర్పోర్ట్ అధికారులతో ముఖాముఖి
- అభివృద్ధి విషయంలో అనుమానాలు నివృత్తి
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : భోగాపురంలో ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మందస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన స్థానికులు బుధవారం పరిశీలించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, రెవెన్యూ అధికారులు సైతం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. మందస మండలంలోని బిడిమి, బేతాళపురం, లక్ష్మీపురం, ఎం.గంగువాడ, బహడపల్లి, మందస, జెడ్పీహెచెస్ బేతాళపురం గ్రామాలతో పాటు వజ్రపుకొత్తూరు మండలం వంకులూరు, మెట్టూరు, తోటూరు, గుణుపల్లె, అనకాపల్లి, గడూరు, దెప్పూరు, అక్కుపల్లి, చినవంక, దోకులపాడు, కిడిసింగి, మర్రిపాడు గ్రామాల నుండి మొత్తంగా 152 మంది స్థానికులు భోగాపురం విమానాశ్రయాన్ని పరిశీలించారు.
భోగాపురం విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ ప్రతినిధులు.. పలాస నుండి విచ్చేసిన రైతులు, స్థానికులకు ఎయిర్పోర్ట్ రాకముందు.. వచ్చిన తరువాత పరిస్థితులను వివరించారు. ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది.. భవిష్యత్ లో జరిగే వృద్ధిని సైతం గణాంకాలతో సహా స్పష్టం చేశారు. స్థానికంగా భూములను త్యాగం చేసిన రైతులు, స్థానిక యువతతో సైతం మాట్లాడిన పలాస రైతులు.. అన్ని అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.
అభివృద్ధి దిశగా బలమైన అడుగు వేసేందుకు పలాస ప్రాంతంలో విమానాశ్రయం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్న సందర్భంలోనే భోగాపురంలో ఈ అధ్భుతం ఆవిష్కృతం అయిందని, పలాసలో కూడా అభివృద్ధి విషయంలో మనం తొందరపడాలని కోరారు. అభివృద్ధి విషయంలో అడ్డుపడేవారు.. భోగాపురం విమానాశ్రయంను ఒకసారి పరిశీలిస్తే.. వారి అనుమానాలు నివృత్తి అవుతాయని అన్నారు. అవకాశం, అదృష్టం జీవితంలో ఒకసారి మాత్రమే వస్తాయని.. పలాస పరిసర ప్రాంత యువత భవిష్యత్ మారాలి అంటే.. ఇదే సరైన తరుణం అని అన్నారు.
శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. జీఎంఆర్ అధికారులతో మాట్లాడిన తరువాత ఏ స్థాయిలో ఉపాధి విమానాశ్రయం ద్వారా అందుబాటులోకి వస్తుందో స్పష్టమైందని అన్నారు. ఇంటర్మీడియట్ స్థాయి నుండే ఉపాధి అవకాశాలు ఎయిర్పోర్ట్ ద్వారా పుష్కలంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు.
పలాస నియోజకవర్గం నుండి విచ్చేసిన రైతులు, స్థానికులు, మహిళలు భోగాపురం విమానాశ్రయం చూసి చాలా ఆనందం వేసిందని స్పష్టం చేశారు. అభివృద్ధి విషయంలో మా ఆలోచన మార్చుకున్నామని.. మరో పదిమంది స్థానికులతో మాట్లాడుతూ, విమానాశ్రయ ఉపయోగాలు వివరిస్తామని తెలిపారు. ప్రభుత్వం కూడా స్థానిక రైతులకు, యువతకు పూర్తి భరోసాగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్, పలాస ఆర్డీవో అప్పలరాజు, జీఎంఆర్ ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, స్థానికులు, భోగాపురం రైతులు తదితరులు పాల్గొన్నారు.
