I Bomma | బప్పం సైట్ లో మళ్ళీ సినిమాల దర్శనం..
I Bomma | బప్పం సైట్ లో మళ్ళీ సినిమాల దర్శనం..
- ఐ బొమ్మ కేసులో ముమ్మర దర్యాప్తు
- అంర్జాతీయ మూలాలపై ఫోకస్
- సైబర్ క్రైమ్ డీసీపీ అర్వింద్ బాబు
తెలుగు సినీ పరిశ్రమకు భారీ నష్టాలు కలిగిస్తున్న పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో చర్యలు చేపట్టినప్పటికీ, తాజాగా కొత్త డొమైన్లు, కొత్త సైట్ల రూపంలో మళ్లీ సినిమాలు అందుబాటులోకి రావడం పోలీసులను అప్రమత్తం చేసింది.
ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నామని, దర్యాప్తు పలు కోణాల్లో కొనసాగుతోందని సైబర్ క్రైమ్ డీసీపీ అర్వింద్ బాబు తెలిపారు. ఐబొమ్మకు అనుబంధంగా పనిచేస్తున్నట్లు ప్రచారం జరిగిన వ్యక్తి ఇమ్మడి రవికి ఈ వ్యవహారంలో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు.
ఈ పైరసీ నెట్‌వర్క్ వెనుక అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తులు, సాంకేతిక వనరులు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. సర్వర్లు, డొమైన్ రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను విశ్లేషిస్తున్నామని చెప్పారు. ఐబొమ్మ పేరుతో లేదా దానికి అనుబంధంగా ఉన్న పలు వెబ్‌సైట్ల ద్వారా కొత్త సినిమాలను అక్రమంగా ప్రసారం చేస్తున్న వారిని గుర్తించే పనిలో సైబర్ నిపుణుల బృందాలు నిమగ్నమయ్యాయని తెలిపారు.
విదేశీ సంస్థలు, సంబంధిత ఏజెన్సీల సహకారంతో సమాచారం సేకరిస్తున్నామని వెల్లడించారు. దర్యాప్తు కీలక దశకు చేరుకుందని, కేసులో ఉన్న ప్రధాన నిందితులను త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని డీసీపీ అర్వింద్ బాబు ధీమా వ్యక్తం చేశారు. సినీ ప్రేక్షకులు పైరసీ వెబ్‌సైట్లకు దూరంగా ఉండాలని, చట్టబద్ధమైన వేదికల ద్వారా మాత్రమే సినిమాలు వీక్షించాలని పోలీసులు సూచించారు.
