డివిజన్‌లో కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆకస్మిక పర్యటన

ప్రజలతో మాట్లాడి పారిశుధ్య సేవలపై వివరాల సేకరణ

ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 4వ డివిజన్‌లో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్‌లో పారిశుధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, కాలువల శుభ్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

పర్యటనలో భాగంగా స్థానిక ప్రజలతో కమిషనర్ మాట్లాడారు. ట్రాక్టర్లు, ఆటోలు ఏ సమయంలో వస్తున్నాయి, ప్రతిరోజూ తమ ప్రాంతానికి చెత్త సేకరణ వాహనాలు వస్తున్నాయా లేదా, కాలువలను ఎప్పుడు శుభ్రం చేశారు, పిచ్చి మొక్కలను ఎప్పుడు తొలగించారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజలకు పారిశుధ్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని నేరుగా ప్రజల నుంచే తెలుసుకున్నారు.

అనంతరం పారిశుధ్య జవాన్, కార్మికులు, డ్రైవర్లతో మాట్లాడారు. ప్రతిరోజూ ఏ సమయంలో విధులకు హాజరవుతున్నారు, కేటాయించిన ప్రాంతాల్లో ఏ సమయానికి చెత్త సేకరణ చేస్తున్నారు, తమకు నిర్దేశించిన రూట్ మ్యాప్ ఉందా, దాని ప్రకారం వాహనాలు తిరుగుతున్నాయా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సిబ్బంది నిర్వహిస్తున్న రోజువారీ రూట్ మ్యాప్ పుస్తకాలు, రూట్ మ్యాప్ రిజిస్టర్లను కమిషనర్ పరిశీలించారు. అలాగే చెత్త సేకరణ వాహనాల లాగ్‌బుక్‌ను పరిశీలించి ప్రతిరోజూ ఆటోలు, ట్రాక్టర్లు ఏయే ప్రాంతాలకు వెళ్తున్నాయి, కేటాయించిన రూట్ ప్రకారం చెత్త సేకరణ జరుగుతోందా అనే వివరాలను పరిశీలించారు.

ప్రతిరోజూ ఉదయం ట్రాక్టర్లు, ఆటోలు తమకు కేటాయించిన రూట్ మ్యాప్ ప్రకారం ప్రతి ఇంటి నుంచి చెత్తను తప్పనిసరిగా సేకరించాలని కమిషనర్ ఆదేశించారు. ఏ ప్రాంతంలోనూ చెత్త సేకరణకు అంతరాయం లేకుండా, నిర్దేశించిన సమయంలో వాహనాలు తప్పనిసరిగా ఆయా ప్రాంతాలకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.

అదేవిధంగా డివిజన్‌లోని కాలువల్లో పేరుకుపోయిన మట్టి, పూడిక, గడ్డి, వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగించాలని ఆదేశించారు. కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయి నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా కాలువలను నిరంతరం శుభ్రంగా ఉంచాలని జవాన్, పారిశుధ్య సిబ్బందిని ఆదేశించారు.

పారిశుధ్య సిబ్బంది తమకు కేటాయించిన రూట్‌లో సమయపాలనతో విధులు నిర్వహిస్తూ, ఇంటింటి చెత్త సేకరణను ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు. వాహనాలు నిర్దేశిత రూట్‌లో తిరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని నిరంతరం పర్యవేక్షించాలని జవాన్‌ను ఆదేశించారు.

ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో ఆకస్మిక పర్యటనలు, తనిఖీలు కొనసాగుతాయని కమిషనర్ స్పష్టం చేశారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.