ఉచిత ప్రయాణం.. మహిళలకు ఇబ్బందుల ప్రయాణమా?

మేడ్చల్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “మహాలక్ష్మి” పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం, ప్రధానంగా పల్లె వెలుగు మరియు ఎక్స్‌ప్రెస్ బస్సులకు మాత్రమే ఈ సదుపాయాన్ని పరిమితం చేసింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పల్లె వెలుగు బస్సులు తక్కువగా ఉండటం, ఉన్నవే అధిక రద్దీతో నడవడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొనడంతో కొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో సీట్లు దొరకక నిలబడి ప్రయాణించడం వృద్ధులు, గర్భిణులకు కష్టంగా మారింది.

ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చిన తరువాత బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో, ప్రయాణికుల మధ్య, కండక్టర్లతో వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. జీరో టికెట్లు తీసుకునే సమయంలో గుర్తింపు కార్డుల పరిశీలనలో ఆలస్యం, సీట్ల కోసం గొడవలు సాధారణమయ్యాయి.

అదేవిధంగా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించకపోవడంతో దూరప్రాంతాలకు వెళ్లే మహిళలు అదనపు ఖర్చు భరించాల్సి వస్తోంది. “ఉచితం ఉన్నా అవసరమైన సమయంలో బస్సు దొరకడం లేదు” అనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.

పథకం లక్ష్యం మంచిదేనని అంగీకరించిన మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని, డీలక్స్ బస్సుల్లో కూడా రాయితీ కల్పించాలని, ప్రయాణ భద్రత, సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.

Leave a Reply