చేప మందు పంపిణీకి విశేష స్పందన
చేప మందు పంపిణీకి విశేష స్పందన
- మృగశిర కార్తె సందర్భంగా 5 వేల మందికి ఔషధాల పంపిణీ
దండేపల్లి, ఆంధ్ర ప్రభ:
మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా మండలంలోని దండేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఉచిత ఆయుర్వేద చేప మందుల పంపిణీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. రంగసాయి ప్రేమ్ రాజ్ భూ లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గిరిజన అభివృద్ధి సంక్షేమ ఆర్థిక శాఖ చైర్మన్ కొట్నాక తిరుపతి, సర్పంచ్ అజ్మీరా రాజేశ్వర్ నాయక్ మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దమ్ము, దగ్గు, ఉబ్బసం, పక్షవాతం, తిమ్మిర్లు, మోకాళ్ల నొప్పులు, జాండీస్ తదితర అనారోగ్య సమస్యలకు సంబంధించిన ఆయుర్వేద ఔషధాలను మొత్తం 5 వేల మందికి పంపిణీ చేసినట్లు తెలిపారు.
మంచిర్యాల జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాలతో పాటు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మందులను తీసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మృగశిర కార్తె సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన ఆయుర్వేద ఔషధాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సిరికొండ నవీన్, మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ గొట్ల భూమన్న, నాయకులు కట్ట వెంకటేష్, గుండ రవీందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

