Suryapet | ఆదిప‌త్య పోరుకు కాంగ్రెస్ నేత‌ బ‌లి

మిరియాల మాజీ స‌ర్పంచ్ దారుణ హ‌త్య‌
నూతనకల్, ఆంధ్ర‌ప్ర‌భ : సూర్యాపేట జిల్లా మిరియాల గ్రామంలో ఇరువర్గాల మధ్య జరుగుతున్న ఆదిప‌త్య పోరులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆ గ్రామ మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్య బ‌లయ్యారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ బంగ్లాలో తన అనుచరుడి పెయింటింగ్ షాపు ప్రారంభోత్సవానికి వెళ్లారు. అక్కడ కార్యక్రమాల తర్వాత సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో గ్రామానికి వచ్చారు. ఆ తర్వాత సాయంత్రం సమయంలో తాను వ్యవసాయం చేస్తున్న పొలం వద్దకు ఒంటరిగా వెళ్లారు.

ఆయన వెంట ఎప్పుడూ ఇద్దరు లేదా ముగ్గురు ఉండేవారు. కానీ సోమవారం సాయంత్రం ఆయన ఒక్కరే వెళ్లారు. పనులు చేస్తున్న సమయంలో చక్రయ్యపై దుండగులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడి ఘటనను పక్కనున్న గొర్రెల కాపరులు గ‌మ‌నించి గ్రామ‌స్థుల‌కు సమాచారమిచ్చారు. అక్క‌డ‌కు చేరుకున్న గ్రామ‌స్తులు సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయ‌న మృతిచెందాడు.

19మందిపై కేసు న‌మోదు…
ఈ ఘటనకు సంబంధించి 19మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేట డీఎస్పీ రవికుమార్‌ తెలిపారు. మృతుడి కుమార్తె అనిత ఫిర్యాదుతో తొలుత 17మందిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మరో ఇద్ద‌రిని చేర్చారు. జిల్లా ఆసుపత్రిలో శవ పరీక్షల అనంతరం చక్రయ్య మృతదేహాన్ని ఇవాళ మిర్యాల గ్రామానికి త‌ర‌లించారు.

గ్రామంలో పోలీసు ప‌హారా…
కాంగ్రెస్ నేత‌, మాజీ స‌ర్పంచ్ చ‌క్ర‌య్య హత్య నేపథ్యంలో మిర్యాలలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అపరిచిత, అనుమానిత వ్యక్తులు సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని గ్రామస్థులను కోరారు. పార్టీలో వర్గ విభేదాలు కారణమని కొందరు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ని చంపేశారని అంటున్నారు. పోలీసులు వివ‌రాలు సేక‌రిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *