37% voting | తమిళనాడులో హోరెత్తుతున్న పోలింగ్

37% voting | తమిళనాడులో హోరెత్తుతున్న పోలింగ్
- మధ్యాహ్నానికే 37% ఓటింగ్ నమోదు!
- క్యూలైన్లలో ప్రముఖులు
37% voting | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అత్యంత ఉత్సాహంగా సాగుతోంది. ఉదయం 9 గంటలకే 17.69% ఓటింగ్ నమోదు కాగా, మధ్యాహ్నం 11 గంటల సమయానికి అది 37.56 శాతానికి చేరుకోవడం ఓటర్ల చైతన్యానికి నిదర్శనం. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, పళనిస్వామి వంటి దిగ్గజాలతో పాటు.. సూపర్ స్టార్ విజయ్, ధనుష్, త్రిష వంటి సినీ తారలు క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నటుడు విజయ్ ఎంట్రీతో ముక్కోణపు పోరు:
ఈసారి ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ముక్కోణపు పోటీ నెలకొంది. సంప్రదాయ ప్రత్యర్థులైన డీఎంకే, ఏఐఏడీఎంకే-బీజేపీ కూటములకు తోడు.. సొంత పార్టీ (TVK) పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్ ఏ మేరకు ప్రభావం చూపుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ముక్కోణపు పోటీ వల్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ భారీగా కనిపిస్తోంది.
ఒకచోట ఉద్రిక్తత.. మరోచోట బహిష్కరణ:
చెన్నైలోని తేనాంపేటలో ఓటర్ ఐడీల విషయంలో డీఎంకే, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. మరోవైపు, తిరునెల్వేలి జిల్లాలోని పెరుంపత్తు గ్రామస్థులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో జరిగిన జంట హత్యల కేసులో న్యాయం జరగలేదని నిరసిస్తూ, గ్రామం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికలను బహిష్కరించి ప్రజాస్వామ్య నిరసనను తెలియజేశారు.
ఓటు వేయాలన్న తపనతో వచ్చి.. అనంత లోకాలకు:
ఓటు వేయడానికి బెంగళూరు నుంచి వస్తున్న ధర్మపురి జిల్లా ఓటర్ల ప్రయాణం విషాదాంతమైంది. కృష్ణగిరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించడం తీవ్ర విచారాన్ని నింపింది. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, అధికారులు క్యూలైన్లలో చల్లని నీరు, షేడ్ నెట్లు ఏర్పాటు చేయడంతో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
