డీజిల్ తంటాతో కొట్లాట

డీజిల్ తంటాతో కొట్లాట

  • పెట్రోల్ బంక్‌ లో లడాయి
  • డీజిల్ వివాదం.. బంకులో దుమారం
  • కస్టమర్-సిబ్బంది మధ్య పిడిగుద్దుల యుద్ధం

కారేపల్లి, ఆంధ్రప్రభ : కారేపల్లి మండలం, గిద్దవారిగూడెం స్టేజి వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ వర్ల పెట్రోల్ బంక్‌లో ఆదివారం డీజిల్ కొరత సమస్య ఉద్రిక్తతకు దారి తీసి, చివరకు ఘర్షణగా మారింది. డీజిల్ అందుబాటులో లేకపోవడం, సరఫరాపై స్పష్టత లేకపోవడంతో కస్టమర్లు అసహనం వ్యక్తం చేస్తూ బంక్ సిబ్బందితో వాగ్వాదం చోటుచేసుకుంది. కస్టమర్లు తెలిపిన వివరాల ప్రకారం.. డీజిల్ కోసం బంక్‌ లో క్యూలైన్లో పెట్టిన వాహనాలు, డీజిల్ క్యాన్ల విషయమై సిబ్బంది అవకతవకలు చేస్తున్నారనే విషయమై కస్టమర్‌కు సరైన సమాధానం లభించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలో కస్టమర్ మరియు సిబ్బంది మధ్య మాటల తూటాలు ఎగిరాయి. కొద్ది సేపటికే పరిస్థితి అదుపు తప్పి, ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పిడిగుద్దులు మార్చుకున్నారు. ఈ ఘటనతో బంక్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడున్న ఇతర కస్టమర్లు, స్థానికులు జోక్యం చేసుకుని గొడవను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో స్వల్ప గాయాలు పొందినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బంక్ యజమాని పోలీసులను సంప్రదించాడు. డీజిల్ కొరత కారణంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని, బంక్‌ల వద్ద సరైన సమాచారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.