సెన్సస్ అవగాహన కోసం ఘనంగా 5కే రన్..

సెన్సస్ అవగాహన కోసం ఘనంగా 5కే రన్..
స్వీయ గణనకు ప్రజలు ముందుకు రావాలి..
ఏప్రిల్ 30లోపు స్వీయ గణన పూర్తి చేయాలి…
సెన్సస్ ప్రతి పౌరుని బాధ్యత..
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : “సెన్సస్ ప్రతి పౌరుని బాధ్యత” అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చేరవేయడమే సెన్సస్ 5కే రన్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. సెన్సస్ ఔట్‌రీచ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నంద్యాల లో టెక్కే మార్కెట్ యార్డ్ వద్ద 5 కిలోమీటర్ల రన్‌ను కలెక్టర్ ప్రారంభించారు. టెక్కే మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు సాగిన ఈ రన్‌లో జిల్లా అధికారులు, యువత, విద్యార్థులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా పరుగులు తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “సెన్సస్ ప్రతి పౌరుని బాధ్యత” అని స్వీయ గణనకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చేరవేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. జనగణన ద్వారా దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర అవగాహన ఏర్పడి, సరైన ప్రభుత్వ విధానాల రూపకల్పనకు ఇది బలమైన పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా “జనగణన 2027” కార్యక్రమంలో భాగంగా చేపట్టిన స్వీయ గణన (Self Enumeration) ప్రక్రియపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ కోరారు.

ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు ప్రజలు తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకు sc.census.gov.in పోర్టల్‌ను వినియోగించి ఇంటి వివరాలు, భౌగోళిక స్థానం (జియో-లొకేషన్) నమోదు చేయాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని, కేవలం సరైన సమాచారం అందించడం ద్వారా నమోదు పూర్తవుతుందని వివరించారు.
ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసిన తర్వాత ఒక ప్రత్యేకమైన SC ID జెనరేట్ అవుతుందని, అనంతరం ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడిని చూపితే సరిపోతుందని తెలిపారు. నంద్యాల జిల్లాలో సుమారు 6 లక్షల కుటుంబాలు ఉన్నాయని, అందరూ గడువులోగా స్వీయ గణన పూర్తి చేసి ప్రభుత్వానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలంటే ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం అత్యంత అవసరమని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొని ప్రజల్లో చైతన్యం కల్పించారు. మొత్తం కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారు.
