భక్తులకు సౌకర్యాలపై పర్యవేక్షణ…
భక్తులకు సౌకర్యాలపై పర్యవేక్షణ…
దేవాలయాల్లో తాగునీరు, పారిశుద్యంపై ప్రత్యేక దృష్టి
ఐ వి ఆర్ ఎస్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చర్యలు
ఘాట్ రోడ్ నుంచి ఆలయం వరకు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఈఓ
వేసవి దృష్ట్యా కూల్ పెయింట్, చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను బలోపేతం చేస్తూ, తాగునీరు, పారిశుద్యంపై మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సమీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో దుర్గగుడి ఆలయ ఈవో శీనానాయక్ ఆధ్వర్యంలో సమగ్ర తనిఖీలు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఐ వి ఆర్ ఎస్ కాల్స్ ద్వారా సేకరిస్తున్న ఫీడ్‌బ్యాక్ నేపథ్యంలో దేవాలయాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించారు.
ముఖ్యంగా త్రాగునీటి సరఫరా, పారిశుద్య నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలని శాఖ కమిషనర్ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో శీనానాయక్, దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఘాట్ రోడ్ ఓం నుంచి ప్రధాన ఆలయం అంతర్గత ప్రాంగణం వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. తాగునీటి సరఫరా వ్యవస్థ, శుచిత్వ పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి, అవసరమైన మెరుగుదలలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో ఉష్ణోగ్రతలను తగ్గించే విధంగా కూల్ పెయింట్ వినియోగం, నడక మార్గాల్లో కాయిర్ మ్యాట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదనంగా భక్తులకు ఉపశమనం కలిగించేలా చలువ పందిళ్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

భక్తుల నుంచి నేరుగా అందుతున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా సేవల నాణ్యతను పెంచడమే లక్ష్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎల్. రమాదేవి, ఏఈవో ఎన్. రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
