ప్రముఖ న్యాయవాది నరహరిశెట్టి శ్రీహరి మృతి

ప్రముఖ న్యాయవాది నరహరిశెట్టి శ్రీహరి మృతి
నివాళులర్పించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి
నివాళులర్పించిన దేవినేని అవినాష్, వెలంపల్లి తదితర నేతలు
భవానిపురం, ఆంధ్రప్రభ : ప్రముఖ హైకోర్టు న్యాయవాది,సమైక్యాంధ్ర ఉద్యమ నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరహరిశెట్టి శ్రీహరి బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయనకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. సుదీర్ఘ కాలంగా న్యాయవాదిగా పని చేస్తున్న శ్రీహరి సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు.అలాగే నేషనల్ కాపు ఫెడరేషన్ పేరుతో కాపు ఉద్యమానికి అండగా నిలిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ కార్యదర్శిగా పని చేశారు.
అలాగే వావిలాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో మద్య విమోచన ప్రచారానికి కృషి చేస్తూ ప్రత్యేకంగా మద్యానికి వ్యతిరేకంగా పత్రికను నిర్వహించారు. కాపుల సమస్యలపై ఆయన పలు కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే పాతబస్తీ అభివృద్ధి పోరాట సమితి పేరుతో ఈ ప్రాంత అభివృద్ధికి పలు కార్యక్రమాలను నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు న్యాయవాదిగా సుదీర్ఘకాలం పని చేశారు. ఆయన మరణ వార్త తెలియగానే ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఏవీ శేషసాయి వన్‌టౌన్‌లోని ఆయన స్వగృహానికి వెళ్లి నివాళులర్పించారు.
అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వెలంపల్లి శ్రీనివాసరావు, ఆ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పీ గౌతంరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, మాజీ శాసనసభ్యులు వంగవీటా రాధా, కిలారు రోశయ్య, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (హైదరాబాద్) అధినేత ఉమారెడ్డి రమణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాము, వివిధ పార్టీలకు చెందిన కొలనుకొండ శివాజీ, ఆకుల శ్రీనివాస్, మహాదేవు అప్పాజీరావు, నరేంద్ర, కొనిజేటి రమేష్ తదితరులు నివాళులర్పించారు.
అలాగే శ్రీహరి సోదరుడు నరహరిశెట్టి నరసింహరావు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షునిగా పని చేస్తున్నారు. రాష్ట్రం విడిపోకుండా ఉండాలని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మొదలు పెట్టింది శ్రీహరి అని పలువురు ఆయనకు నివాళులర్పించారు. గురువారం ఉదయం పదకొండు గంటలకు నరహరిశెట్టి శ్రీహరి అంతిమయాత్ర ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
