మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

ఉయ్యూరు, ఆంధ్రప్రభ : విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై ఉయ్యూరు బైపాస్ సమీపంలోని జియో పెట్రోల్ బంక్ వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి.
యానం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా ప్రయాణికులు గాయపడ్డారు.
స్థానికుల సహాయంతో గాయపడిన వారిని 108 అంబులెన్స్ వాహనాల ద్వారా ఉయ్యూరు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. బస్సు ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
