శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి

తిరుమల, ఆంధ్రప్రభ : భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్ఓ మురళీకృష్ణ సాదరంగా ఆహ్వానించారు. అర్చకులు ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.

అనంతరం ఉపరాష్ట్రపతి ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. టీటీడీ చైర్మన్, ఈవో కలిసి స్వామివారి చిత్రపటం మరియు తీర్థప్రసాదాలను ఉపరాష్ట్రపతికి అందించారు.
శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి దర్శనం
శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారిని కూడా ఉపరాష్ట్రపతి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్లాల్, టీటీడీ బోర్డు సభ్యులు రామమూర్తి, భాను ప్రకాష్ రెడ్డి, జంగా కృష్ణమూర్తి తదితర రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
