యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలి
యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలి
- జాతీయ రహదారిపై రైతుల ధర్నా, రాస్తారోకో
కమ్మర్పల్లి, ఆంధ్రప్రభ: యూరియా యాప్ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు. బుధవారం కమ్మర్పల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారి-63పై హసకొత్తూరు చౌరస్తాలో యూరియా యాప్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరియా పంపిణీకి అమలు చేస్తున్న యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, గతంలో మాదిరిగానే సహకార సంఘాల ద్వారా నేరుగా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు తక్షణమే యూరియా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
రైతులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే యూరియా యాప్ను తీసుకొచ్చి రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. యాప్ ఓపెన్ చేయగానే చాలా సందర్భాల్లో ‘నో స్టాక్’ (స్టాక్ లేదు) అని చూపించడం లేదా సర్వర్ లోపాల వల్ల ఓటీపీలు సకాలంలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
యాప్ విధానం కారణంగా స్మార్ట్ఫోన్ లేని మహిళలు, వృద్ధ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. యూరియా కోసం గంటల తరబడి ఫోన్ల ముందు, సొసైటీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోయారు. గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది రైతులకు స్మార్ట్ఫోన్ల వాడకం, ఆన్లైన్ బుకింగ్ విధానాలపై అవగాహన లేకపోవడంతో వ్యవసాయ అధికారులపైనా, ఇతరులపైనా ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు.
యాప్ ద్వారా కాకుండా పాత విధానంలోనే యూరియాను సొసైటీలకు పంపిస్తే రైతులు నేరుగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి నిబంధనలు లేకుండా యూరియా బస్తాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సొసైటీల్లో తగినంత యూరియా నిల్వలను అందుబాటులో ఉంచాలన్నారు.
ప్రభుత్వం వెంటనే యూరియా యాప్ను ఎత్తివేయాలని, లేకపోతే పెద్దఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సకాలంలో రైతు భరోసా ఇవ్వక రైతులను ప్రభుత్వం నట్టేట ముంచుతోందని మండిపడ్డారు. స్థానిక ఎస్ఐ సి.హెచ్. సతీష్, ఏంఏవో టి. రమ్యశ్రీ ఘటనాస్థలానికి వచ్చి రైతులతో మాట్లాడి శాంతింపజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు రేంజర్ల గంగారాం, బద్రి, తీగల హరీశ్, సంత రాజేశ్వర్, బద్దం చిన్నారెడ్డి, రేంజర్ల మహేందర్, పార్షపు జైపాల్ రెడ్డి, అరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
