సర్పంచ్ జీతం కార్మికులకు అందజేత..

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలోని ముచ్కూర్ గ్రామ పంచాయతీ లో పారిశుద్ధ్య కార్మికులకు సర్పంచ్ కోడిగాల శ్రీనివాస్ ఐదు నెలల వారి యొక్క జీతాన్ని గ్రామపంచాయతీ కార్మికులకు అందజేశారు. సర్పంచ్ జీతం నెలకు 6500/- చొప్పున ఐదు నెలల జీతం మొత్తం రూ.32,500 రావడంతో మంగళవారం ఎనిమిది మంది గ్రామపంచాయతీ కార్మికులకు పంపిణీ చేయగా, కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ పడగల శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి పాలకవర్గం, గ్రామ ప్రజల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో ఉన్న తాగునీటి సమస్యను సుమారు 95 శాతం వరకు పరిష్కరించామని పేర్కొన్నారు.

అభివృద్ధి పనుల్లో భాగంగా స్మశానవాటిక మరమ్మతులు, నూతన బస్టాండ్ నిర్మాణం, కల్వర్టుల నిర్మాణం, ఐమాక్స్ లైట్ల ఏర్పాటు, సుమారు 800 మీటర్ల పైప్‌లైన్ విస్తరణ, కొత్త బోర్లు మరియు మోటార్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టినట్లు వివరించారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ విజయాలకు ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, ఎంపీవో సయ్యద్ జావీద్ అలీ,ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పీఆర్ ఏఈ, ఏపీవో నర్సయ్య తదితర అధికారుల సహకారం ఎంతో ఉందని సర్పంచ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భాశెట్టి రమేష్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కార్మికులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.