మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల కోసం రైతుల ఆందోళన
బోనకల్, ఆంధ్రప్రభ : పండించిన మొక్కజొన్న పంటను సకాలంలో అమ్ముకునే పరిస్థితి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు రోడ్డెక్కారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన రైతులు అఖిలపక్ష నాయకుల మద్దతుతో సోమవారం బోనకల్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. మండలంలో సరిపడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో అమ్మకాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు. ఈ పరిస్థితిని దళారులు ఉపయోగించుకుని రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు.
అన్నదాతల సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నించారు. వెంటనే స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో రైతులతో పాటు సీపీఎం, సీపీఐ, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
