గేమ్ చేంజర్‌గా మారనున్న కొత్తరకం ఇంజిన్
త్వరలోనే హైడ్రోజన్‌తో నడిచే కారు రాబోతోంది
చైనా ఈవీలకు షాకివ్వనున్న జపాన్
ఇకమీదట ఈవీ కార్ల ఉత్పత్తికి బ్రేకులు
ఇప్పటిదాకా ఈవీల ఉత్పత్తిలో చైనా టాప్
ప్రపంచం మార్కెట్ అమ్మకాల్లో 70శాతం వాటా
హైడ్రోజన్ కార్ల రాకతో ఈవీలకు పెద్ద దెబ్బ
త్వరలో టయోటా హైడ్రోజన్ కారు రెడీ
సంచలన విషయం ప్రకటించిన టయోటా సీఈవో కోజి సాటో
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :
కర్బన వాయువులు.. శబ్ధ కాలుష్యం వెదజల్లుతూ రోడ్లపై రయ్‌మంటూ దూసుకెళ్లే కార్లతో పెను ప్రమాదం పొంచి ఉంది. దీనికి విరుగుడుగా ఎలక్ట్రానిక్ వాహనాలు బెటర్ అనుకున్నారు. అయితే.. వాటితోనూ ముప్పు తప్పదని ఆటోరంగంలోని నిపుణులు భావించి సరికొత్త ఇంజిన్‌ను సృష్టించారు. వాహన కాలుష్యంతో అల్లాడిపోతున్న ప్రపంచ పర్యావరణ ప్రజానికానికి ఇకమీదట పొల్యూషన్ అనేది ఉండకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీనిలో భాగంగా తొలుత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈ కష్టాన్ని కడతేరుస్తున్నాయని అంతా అనుకున్నారు. ఇటు స్థిరమైన రవాణా కోసం వినియోగదారులు.. అటు బంగారు భవిష్యత్తు కోసం ఆటోమోటివ్ పరిశ్రమ యావత్తూ ఈవీలవైపు మొగ్గు చూపుతోంది. ఈ తరుణంలో దీనికి తగ్గట్టుగానే ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఇండియా, జపాన్ మినహా మిగిలిన దేశాలన్నీ ఈవీలకే విజిల్ వేస్తున్నాయి. అయితే.. ఈవీల తయారీలో టాప్ లెవల్‌లో ఉన్న చైనా.. ప్రపంచంలో 70శాతం అమ్మకాలు కొనసాగిస్తోంది. కాగా, జపాన్ సరికొత్త ఇంజిన్ తయారీతో చైనా దూకుడుకు బ్రేకులు పడే అవకాశాలున్నాయి. జపాన్‌కు చెందిన టొయోటా కార్ల తయారీ కంపెనీ హైడ్రోజన్ ఇంజిన్‌ను రెడీ చేసింది. ఈ విషయాన్న టొయోటా సీఈవో కోజి సాటో వెల్లడించారు. ఈ హైడ్రోజన్ కార్లు అందుబాటులోకి వస్తే ఇక ఈవీల శకం ముగిసినట్టేనని నిపుణులు చెబుతున్నారు.
భారీగా ఈవీల కొనుగోళ్లు..
నార్వేలో అయితే ఈవీ కొనుగోళ్లు భారీగా పెరిగాయి. పది కార్లల్లో ఎనిమిది ఈవీలే ఉన్నాయి. నార్వే తర్వాత ఐస్‌లాండ్ రెండో స్థానంలో, స్వీడన్ మూడో స్థానంలో, నెదర్లాండ్స్ నాలుగో స్థానంలో ఉంది. అమెరికా కాలిఫోర్నియాలో అత్యధికంగా 4,25,300 ఎలక్ట్రిక్ వాహనాలున్నాయి, ఇక.. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతు ఇస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను ఆదరిస్తున్నారు.
టయోట సంచలనం
రోడ్లపై ఈవీల మనుగడ ఉండదు. ఎందుకంటే ఆటోమోటివ్ టెక్నాలజీలో గేమ్-చేంజర్ ఇంజిన్‌ను టయోటా సీఈవో కోజి శాటో ఇటీవల ఆవిష్కరించారు. దీన్ని అంతర్గత దహన యంత్ర సాంకేతికతలో పురోగతి”గా ప్రపంచానకి పరిచయం చేశారు. హైడ్రోజన్ ఇంధనం అధునాతన హైబ్రిడ్ వ్యవస్థల ప్రత్యేక కలయికతో ఈ కొత్త ఇంజిన్ అంకురించింది. సాంప్రదాయ గ్యాసోలిన్ ఇంజిన్ల కంటే ఎక్కువ సామర్థ్యం, తక్కువ ఉద్గారాలతో ముందుకు సాగుతుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలను పీడిస్తున్న చార్జింగ్ సమస్య, మౌలిక సదుపాయాల వంటి వాటిని హైడ్రోజన్ ఇంజిన్‌తో వచ్చే కార్లు సమర్థవంతంగా ఎదుర్కొంటాయి.
హైడ్రోజన్ కార్లకే ప్రాధాన్యం..
టయోటా సీఈవో కోజి శాటో తెలిపినట్టు నిజంగానే ఎలక్ట్రిక్ కార్లను హైడ్రోజన్ కారు అంతం చేయగలదా? ఒకసారి టయోటా కబురును పరిశీలిద్దాం. హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ కోసం ఇప్పటికే ఉన్న గ్యాస్ స్టేషన్లను సులభంగా స్వీకరించవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం విస్తృత చార్జింగ్ నెట్‌వర్క్‌లను నిర్మాణాలకు వ్యయ ప్రయాసలతో పని లేదు. సాంకేతికతంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ హైడ్రోజన్ ఇంజిన్‌ల ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయని అంచనా. అధిక ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే వినియోగదారులకు హైడ్రోజన్ కార్ల ధరలే మరింత అందుబాటులో ఉంటాయి. ఇక .. చాలా మంది డ్రైవర్లు ఇప్పటికీ సాంప్రదాయ ఇంధన వనరుల సౌలభ్యాన్నే ఇష్టపడతారు. సీఎన్జీ వెహికల్స్‌ను ఎలక్ట్రిక్ వెహికల్స్ గా మార్చటానికి వినియోగదారులు వెనుకాడుతున్నారు. ఈ స్థితిలో హైడ్రోజన్ ఇంధన ఇంజన్ మార్పిడికి విస్తృతంగా వినియోగదారులు ఆసక్తి చూపుతారు.
ఆటోమోటివ్ రంగంలో తీవ్ర సంచలనం..
హైడ్రోజన్ ఇంజిన్ కారు ప్రకటన ఆటోమోటివ్ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. కొంతమంది నిపుణులు టయోటా వినూత్న విధానాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు ప్రధాన ఇంధన వనరుగా హైడ్రోజన్ ఆచరణాత్మకత గురించి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో హైడ్రోజన్ ఉత్పత్తి, పంపిణీ, నిల్వ సవాళ్లను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. పర్యావరణవేత్తల నుంచి ఆసక్తికర మద్దతు కనిపిస్తోంది. పర్యావరణ న్యాయవాదులు ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. టయోటా కొత్త ఇంజిన్ వాస్తవానికి తక్కువ ఉద్గారాలను, ఎక్కువ సామర్థ్యాన్ని అందించగలిగితే.. అది గ్యాసోలిన్ ఎలక్ట్రిక్ వాహనాలు రెండింటికీ ఆచరణీయ ప్రత్యామ్నాయాన్ని అందించవచ్చు. ఇది మరింత స్థిరమైన భవిష్యత్తుకు దోహదం చేస్తుంది.
ఈవీల మనుగడకు సవాల్..
టయోటా ఈ ఇంజిన్ అభివృద్ధితో ముందుకు సాగుతున్నప్పుడు, హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ స్టేషన్లకు అవసర మౌలిక సదుపాయాలను సృష్టించడానికి కంపెనీ విస్తృత మైన పరీక్షలకు ప్రభుత్వాల సహకారాన్ని తీసుకుంటుంది. రాబోయే తొలి వాణిజ్య నమూనాలను అందుబాటులో తీసుకు రావటమే తమ లక్ష్యం అని టమోటా సీఈవో కోజిసాతో అన్నారు. ఈ విప్లవాత్మక ఇంజిన్ పరిచయంతో, కంపెనీ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌ను సవాలు చేయటమే కాదు, వినియోగదారులకు ఆకర్షణీయ ప్రత్యామ్నాయాన్ని అందించడమే టయోటా లక్ష్యంగా పెట్టుకుంది.