MeeMart | ఏపీలో 1,000 ‘మీ మార్ట్’లు..
- కేంద్ర సంస్థతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం
- పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో తొలి దశ ప్రారంభం
- చౌకధరల దుకాణాల ద్వారా 70 నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి
అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యి ‘మీ మార్ట్’ కేంద్రాల ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు ఐఏఎస్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ , భారత ప్రభుత్వ జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్‌సీసీఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ అనిస్ జోసెఫ్‌తో న్యూఢిల్లీలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం తొలి దశలో పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఇప్పటికే ఉన్న చౌకధరల దుకాణాల ద్వారా ‘మీ మార్ట్’ సేవలను ప్రారంభించనున్నారు. ఈ కేంద్రాల ద్వారా సుమారు 70 నాణ్యత ప్రమాణాలు కలిగిన నిత్యావసర వినియోగ వస్తువులను పోటీ ధరలకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా వెయ్యి ‘మీ మార్ట్’లను ఏర్పాటు చేసి, చౌకధరల దుకాణాలను బహుళ వినియోగ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కార్యక్రమం ద్వారా నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటు ధరల్లో ప్రజలకు అందించడంతో పాటు, ప్రజా పంపిణీ వ్యవస్థ సేవలను మరింత విస్తరించేందుకు అవకాశం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

