Ex-gratia 2lakhs | మృత్యుఒడికి చేరిన 11 మంది

Ex-gratia 2lakhs | మృత్యుఒడికి చేరిన 11 మంది

Ex-gratia 2lakhs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో బుధవారం రాత్రి పెను విషాదం చోటుచేసుకుంది. బ్రేకులు ఫెయిలైన ఒక లారీ.. బీభత్సం సృష్టించడంతో జరిగిన వరుస ప్రమాదాల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ఇరుక్కుపోయిన ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ప్రమాదం ఎలా జరిగిందంటే..?

మీర్జాపూర్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రమాండ్‌గంజ్ లోయ ప్రాంతంలోని 135వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కొండపై నుంచి కిందకు వస్తున్న ఒక లారీకి అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అదుపుతప్పిన ఆ లారీ, అటుగా వెళ్తున్న ఆల్టో కారును బలంగా ఢీకొట్టి, ఆ తర్వాత ముందు వెళ్తున్న మరో ట్రక్కును ఢీకొట్టింది. ఇదే క్రమంలో ఆ దారిలోనే వస్తున్న ఒక బొలెరో వాహనం కూడా ఈ ప్రమాదానికి గురైంది.

మంటల్లో చిక్కుకున్న బొలెరో..

వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో బొలెరో వాహనంతో పాటు మరో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల డోర్లు ఇరుక్కుపోవడంతో అందులోని ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. మంటలు క్షణాల్లోనే వాహనం మొత్తానికి వ్యాపించడంతో, అందులో ఉన్న ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. కారు, లారీ డ్రైవర్లు సహా మొత్తం ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

మృతుల్లో ముగ్గురు చిన్నారులు…

సమాచారం అందుకున్న వెంటనే మీర్జాపూర్ ఎస్పీ అపర్ణా రజత్ కౌశిక్, ఫైర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చి, వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మృతుల్లో మీర్జాపూర్ జిల్లా జిగ్నా ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని ఏడుగురు ఉన్నారు. వీరిలో ముగ్గురు చిన్నారులు శివ సింగ్ (8), సోనమ్ (9), పీయూష్ (14) ఉండటం అందరినీ కలచివేసింది. మిగిలిన వారిలో ముగ్గురు మధ్యప్రదేశ్ (సత్నా, సాగర్) కు చెందిన వారు కాగా, ఒకరు సోన్‌భద్ర జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన…

ఈ ఘోర ప్రమాదం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 50 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైవేపై ట్రాఫిక్‌ను క్లియర్ చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply