గౌడ సోదరుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం..

చిలుపూర్, ఆంధ్రప్రభ : ప్రమాదకరమైన వృత్తిలో ఉన్న గౌడ సోదరులకు భద్రత కల్పించాలనే ఉదేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు శిక్షణ ఇచ్చి కాటమయ్య రక్షణ కిట్లను ఉచితంగా పంపిణి చేస్తున్నట్లు స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఎ కడియం శ్రీహరి తెలిపారు.

స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన కాటమయ్య రక్షణ కిట్ల పంపిణి బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని 5మండలాలకు సంబందించిన 678 మంది గౌడ సోదరులకు కాటమయ్య రక్షణ కిట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణి చేశారు.

అనంతరం ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ గౌడ సోదరులు ప్రమాదాలకు గురికాకుండా వారికి భద్రత కల్పించాలనే లక్ష్యంతో బిసి సంక్షేమ శాఖ, ఏక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో కల్లు గీత కార్మికులకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కాటమయ్య రక్షణ కిట్లను పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. 10వేల రూపాయల విలువ చేసే ఈ రక్షణ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. శిక్షణ పొంది రక్షణ కిట్లు తీసుకున్న గౌడ సోదరులు వాటిని పక్కన పెట్టకుండా తప్పకుండా ఉపయోగించాలని సూచించారు.

గ్రామాలలో కుల సంఘాల ఆధ్వర్యంలో రక్షణ కిట్లను ఉపయోగించే విధంగా చూడాలని అలాగే ఏక్సైజ్ శాఖ వారు పంపిణి చేసిన రక్షణ కిట్లు ఉపయోగిస్తున్నారో లేదో అని పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధ పడడం కంటే ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వెల్లడించారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి మొత్తం 1679కాటమయ్య రక్షణ కిట్లు మంజూరు అయ్యాయని ఈ రోజు పంపిణి చేసుకుంటున్న 678తో కలుపుకొని ఇప్పటి వరకు 1558 రక్షణ కిట్లను పంపిణి చేసుకున్నామని తెలిపారు. ప్రమాదానికి గురైన కుటుంబాలకు ప్రభుత్వం 5లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి, ఏక్సైజ్ శాఖ సూపరిండెంట్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, గౌడ కులస్తులు, కల్లు గీతా కార్మికులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.