నాసిరకం విత్తనాల విక్రయం.. డీలర్‌పై రైతు ఫిర్యాదు

కేసముద్రం, ఆంధ్రప్రభ : నాసిరకం మొక్కజొన్న విత్తనాలు విక్రయించి, ఎమ్మార్పీ కంటే అధిక ధర వసూలు చేశారని ఆరోపిస్తూ మండలంలోని నరసింహులగూడెం వాచ్యతండాకు చెందిన రైతు తేజపత్ అరుణ్ పాండ్యన్ గురువారం మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేశారు.

బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మున్సిపాలిటీ కేంద్రంలోని ఉప్పరపల్లి రోడ్ సర్కిల్ వద్ద ఉన్న రమ్య ఏజెన్సీలో రెండు సంచుల మొక్కజొన్న విత్తనాలను రూ.3,500కు కొనుగోలు చేశాడు. మంచి నాణ్యత గల విత్తనాలు కావాలని కోరగా, ఉత్తమ రకం విత్తనాలని చెప్పి విక్రయించినట్లు పేర్కొన్నారు.

గురువారం పొలంలో విత్తనాలు వేసేందుకు సంచులు తెరిచి చూడగా అవి నాసిరకం విత్తనాలుగా ఉండటమే కాకుండా, ప్యాకెట్లపై గడువు తేదీ (ఎక్స్‌పైరీ) ముగిసినట్లు గుర్తించినట్లు తెలిపారు. అలాగే ఎమ్మార్పీ కంటే అధిక ధర వసూలు చేశారని ఆరోపించారు. దీనిపై షాపు యజమానిని ఫోన్‌లో ప్రశ్నించగా బెదిరింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గడువు ముగిసిన, నాసిరకం విత్తనాలను అమాయక రైతులకు విక్రయిస్తూ మోసం చేస్తున్న డీలర్‌పై చర్యలు తీసుకుని షాపును సీజ్ చేయాలని మండల వ్యవసాయ అధికారిని కోరారు.

విత్తన చట్టం ప్రకారం చర్యలు: వ్యవసాయ అధికారి

ఈ విషయంపై మండల వ్యవసాయ అధికారి వెంకన్నను వివరణ కోరగా, ఉప్పరపల్లి క్రాస్ రోడ్డులోని రమ్య ఏజెన్సీని తనిఖీ చేసినట్లు తెలిపారు. తనిఖీలో గడువు ముగిసిన మూడు మొక్కజొన్న విత్తనాల ప్యాకెట్లు గుర్తించినట్లు వెల్లడించారు. వెంటనే మొక్కజొన్న విత్తనాల విక్రయాన్ని నిలిపివేసినట్లు తెలిపారు. పూర్తి విచారణ అనంతరం విత్తనాల చట్టం-1966 ప్రకారం ఉన్నతాధికారులకు నివేదిక పంపించి సంబంధిత డీలర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి తెలిపారు.