మేధా శ్రీను సేవలు చిరస్మరణీయం.. బాపట్లకు తీరని లోటు

  • సంతాప సభలో పలువురు ప్రముఖుల భావోద్వేగ నివాళులు

బాపట్ల, ఆంధ్రప్రభ : మేధా ఎడ్యుకేషనల్ సంస్థల వ్యవస్థాపకుడు, ప్రముఖ సామాజిక సేవకుడు, జర్నలిస్టు నాయకుడు గొర్ల శ్రీనివాసరావు (మేధా శ్రీను) మృతిపట్ల నిర్వహించిన సంతాప సభలో పలువురు రాజకీయ, సామాజిక, మీడియా రంగ ప్రముఖులు ఆయన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. విద్య, సామాజిక సేవ, బీసీల సంక్షేమం, జర్నలిస్టుల ఐక్యత కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, చీరాల మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావు మాట్లాడుతూ మేధా శ్రీను లేని లోటు ఎన్నటికీ తీరదన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లలు, అల్లుళ్లు, మనవలు, మనుమరాళ్లు ధైర్యంగా ముందుకు సాగాలని, వారికి దేవుడు మంచి భవిష్యత్తు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కుటుంబానికి అండగా నిలిచిన బంధువులను అభినందిస్తూ, సభ నిర్వహించిన గంగయ్యకు ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్య అతిథి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ ముప్పలనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీనివాసరావు మరణం కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా సమాజానికే తీరని లోటని పేర్కొన్నారు. ఏ పని అప్పగించినా నిబద్ధతతో, వేగంగా పూర్తి చేసే వ్యక్తిగా ఆయనను గుర్తు చేసుకున్నారు. విద్యాదానమే గొప్ప దానం అనే నమ్మకంతో మేధా కాలేజీ ద్వారా వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారని, రాజకీయాలకు అతీతంగా సమాజ సేవలో విశేష కృషి చేశారని కొనియాడారు. లాభాపేక్ష లేకుండా సేవ చేసిన ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రముఖ పాత్రికేయుడు ఘట్టమనేని సురేష్ మాట్లాడుతూ శ్రీనివాసరావు జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండేవారని అన్నారు. ఎలాంటి విభేదాలు ఉన్నా చిరునవ్వుతో అందరినీ పలకరించే ‘అజాత శత్రువు’ అని అభివర్ణించారు. స్వంత ఖర్చులతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి, ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమించారని చెప్పారు. ఆయన ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ముప్పలనేని శ్రీనివాసరావు తదితర ప్రముఖులతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.

విశిష్ట అతిధి వైయస్సార్సీపి రాష్ట్ర పీఏసీ సభ్యులు, మాజీ శాసనసభ ఉపసభాపతి, బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి మాట్లాడుతూ, రాజకీయాల్లోకి రాకముందే గొర్ల శ్రీనివాసరావు కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎలాంటి నేపథ్యం లేకుండా స్వయంకృషితో మేధా కాలేజీని స్థాపించి బాపట్లలో ప్రముఖ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.

తిరంగారణ వంటి సామాజిక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, సామాజిక చైతన్యం పెంపొందించేందుకు విశేషంగా కృషి చేశారని చెప్పారు. మరణానికి రెండు రోజుల ముందే ఆయనను కలిసి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చనిపోయిన తర్వాత మనిషి సంపాదించేది డబ్బు కాదు, మంచి పేరు అని, మేధా శ్రీను అలాంటి చిరస్థాయి గౌరవాన్ని సంపాదించుకున్న మహనీయుడని పేర్కొన్నారు.

ప్రముఖ మీడియా ప్రతినిధి రెడ్డి సుబ్బారావు మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో బీసీల ఐక్యత కోసం బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడంలో గొర్ల శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. జర్నలిస్టుల యూనియన్ ఏపీడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శిగా జర్నలిస్టుల సంక్షేమం, ఐక్యత కోసం ఆయన నిరంతరం కృషి చేశారని చెప్పారు. జర్నలిస్టుల తరఫున కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సభ ముగింపులో పలువురు వక్తలు గొర్ల శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విద్య, సామాజిక సేవ, జర్నలిజం రంగాల్లో ఆయన అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, మేధా శ్రీను ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.