చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర విషాదం..
రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి
దంపతులు, ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే దుర్మరణం
షాలిమార్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న ఘటన.. దర్యాప్తు ప్రారంభించిన జీఆర్పీ
ప్రమాదమా..? ఆత్మహత్యా..? అన్ని కోణాల్లో విచారణ
ఏలూరు జిల్లా, జూలై 5 (ఆంధ్రప్రభ): ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రైల్వే ట్రాక్ దాటుతున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని చర్లపల్లి–షాలిమార్ ప్రత్యేక రైలు (08046) ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో విశాఖపట్నం వైపు వెళ్తున్న షాలిమార్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ దాటుతున్న నలుగురిని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతులను షేక్ చాంద్ బాషా (50), ఆయన భార్య షేక్ హసీనా (45), కుమార్తెలు షేక్ షర్మిల (23), షేక్ సమీరా (20)గా గుర్తించారు. షర్మిల ఎంబీఏ చదువుతున్నట్లు సమాచారం. చాంద్ బాషా దంపతులు తాడేపల్లిగూడెంలో ఆప్టికల్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు.

స్థానికుల సమాచారం మేరకు ఈ కుటుంబం తాడేపల్లిగూడెం పట్టణంలోని మామిడితోట ప్రాంతంలో గత మూడేళ్లుగా అద్దెకు నివసిస్తోంది. వీరి స్వస్థలం గుడివాడ ప్రాంతమని, సుమారు 25 ఏళ్ల క్రితం తాడేపల్లిగూడెంకు వచ్చి స్థిరపడినట్లు తెలిసింది. కుటుంబం కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు చెబుతున్నప్పటికీ, పోలీసులు మాత్రం కుటుంబంలో ఎలాంటి వివాదాలు ఉన్నట్లు ఇప్పటివరకు గుర్తించలేదని తెలిపారు. కుటుంబానికి ఒక కారు కూడా ఉండగా, దానిని టాక్సీగా నడుపుతూ ఆదాయం పొందుతున్నట్లు వెల్లడించారు.
ఘటనాస్థలంలో షేక్ హసీనా పేరుతో ఉన్న ఏటీఎం కార్డు, తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో పార్కింగ్ రసీదు, రెండు దెబ్బతిన్న మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారనున్నాయి.
ప్రమాదం జరిగిన వెంటనే లోకో పైలట్ రైలును నిలిపివేసి జరిగిన విషయాన్ని సంబంధిత స్టేషన్ అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. ట్రాక్‌పై వ్యక్తులు కనిపించగానే పలుమార్లు హారన్ మోగించినప్పటికీ వారు తప్పుకోలేదని తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న జీఆర్పీ సీఐ, ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల అసలు కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల బంధువులకు సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.
