వేగం మింగేసిన జీవితం..

వేగం మింగేసిన జీవితం..
డివైడర్ ఢీకొని డిగ్రీ విద్యార్థి దుర్మరణం
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం పట్టణంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డిగ్రీ ఫైనలియర్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హయత్ నగర్‌కు చెందిన బిర్లంగి గణేష్ (20) నగరంలోని కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు. అతని తండ్రి ఉపాధ్యాయుడిగా, తల్లి వైద్య నిపుణురాలిగా ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు.
గురువారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో గణేష్ తన స్నేహితుడికి చెందిన ద్విచక్ర వాహనాన్ని తీసుకుని బయటకు వచ్చాడు. సూర్యమహల్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్ వైపు వెళ్తున్న క్రమంలో అతివేగంతో ప్రయాణిస్తూ రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టాడు.
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో గణేష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిశ్శబ్దంగా ఉన్న సమయంలో పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఏకైక కుమారుడు కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
