పుట్టపర్తి రూపురేఖలు మారబోతున్నాయా..? 10 ఏళ్లలో జరిగేది ఇదే..!

పుట్టపర్తి రూపురేఖలు మారబోతున్నాయా..? 10 ఏళ్లలో జరిగేది ఇదే..!
పుట్టపర్తి, ఆంధ్రప్రభ : రాబోయే 10 సంవత్సరాల్లో పుట్టపర్తి ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పుట్టపర్తి సాయిరామ్‌లో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో ఈ ప్రాంతం అభివృద్ధిలో అగ్రభాగాన నిలవనుందని ఆయన తెలిపారు. యుద్ధ విమానాల తయారీ కేంద్రం, సోలార్ పరిశ్రమలు వంటి ప్రాజెక్టులతో పుట్టపర్తి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన పల్లె రఘునాథ్ రెడ్డి, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సాధారణ కుటుంబంలో జన్మించి అత్యున్నత స్థాయికి ఎదిగిన నేతగా ఆయనను అభివర్ణించారు.
సినిమాల్లో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, వెంకటేశ్వర స్వామి పాత్రల్లో ఎన్టీఆర్ నటన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపన ద్వారా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన కృషి చేశారని తెలిపారు.
మహిళలకు స్థానిక సంస్థల్లో 33.3 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ఆ నిర్ణయం వల్ల మహిళలు రాజకీయంగా ముందుకు వచ్చారని ఆయన పేర్కొన్నారు.
పుట్టపర్తి అభివృద్ధి ప్రణాళికలపై మాట్లాడుతూ, ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ పరిశ్రమ ద్వారా లక్ష కోట్ల పెట్టుబడులు, వేల ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. అలాగే 136 కోట్ల రూపాయలతో తాగునీటి ప్రాజెక్టు ప్రారంభించామని వెల్లడించారు.
పుట్టపర్తి ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం కలిగిన ప్రాంతమని, దాని ఖ్యాతిని మరింత పెంచేలా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.
