భీమిని మండలంలో నలుగురిపై ప్రాణాంతక దాడి..
భీమిని మండలంలో నలుగురిపై ప్రాణాంతక దాడి..
- ఒకరిని చనిపోయాడని భావించి వాగులో పడేసిన దుండగులు
- డీసీపీకి ఫిర్యాదు..
- నిందితులపై కఠిన చర్యలు..
- నకిలీ విత్తనాల మాఫియాపై దర్యాప్తు కోరిన బాధితులు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో నకిలీ విత్తనాల దందా వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దందా గురించి పోలీసు అధికారులు, ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారనే కక్షతో నలుగురు వ్యక్తులపై ఆదివారం రాత్రి ప్రాణాంతక దాడి జరిగినట్లు బాధితులు ఆరోపించారు. ఈ మేరకు డీసీపీకి ఫిర్యాదు సమర్పించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
బాధితుల కథనం ప్రకారం, కేస్లాపూర్ గ్రామానికి చెందిన ఇందూరి రాజశేఖర్, ముత్యం రాజశేఖర్, మాడే రాజు, గోసుల మల్లేశ్‌లు జూన్ 14 రాత్రి కేస్లాపూర్ నుంచి వెంకటాపూర్ వెళ్తుండగా రాజారం గ్రామ శివారులో కొందరు వ్యక్తులు దారికాచి అడ్డగించారు. అనంతరం సుమారు 20 మంది కలిసి కర్రలు, ఇనుపరాడ్లు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలిపారు.
దాడిలో ముత్యం రాజశేఖర్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లగా, అతను మరణించాడని భావించిన దుండగులు సమీపంలోని వాగులో పడేసినట్లు బాధితులు ఆరోపించారు. మిగతా ముగ్గురిపై కూడా దారుణంగా దాడి చేసి తీవ్ర గాయాలకు గురిచేసినట్లు పేర్కొన్నారు.
దాడి జరుగుతున్న విషయం తెలుసుకున్న భీమిని ఎస్‌ఐ కోటేశ్వర్ ఘటన స్థలానికి చేరుకుని గొడవను అడ్డుకుని గాయపడిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. అయితే తాము లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని బాధితులు ఆరోపించారు.
నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే దాడి చేశారన్న బాధితులు
నకిలీ విత్తనాల దందాను బట్టబయలు చేస్తున్నందుకే తమపై హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భీమిని, కన్నెపల్లి ప్రాంతాల్లో జరుగుతున్న నకిలీ విత్తనాల మాఫియాపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని డీసీపీని కోరారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఫిర్యాదుపై విచారణ చేపట్టినట్లు సమాచారం.
