యోగను జీవన విధానంగా మార్చుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం
యోగను జీవన విధానంగా మార్చుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం
విద్యార్థి దశ నుంచే యోగా అలవాటు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు, ఆంధ్రప్రభ : యోగ ఒక ఉత్తమ జీవనశైలి అని, ప్రతీ ఒక్కరూ ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే యోగాను తమ జీవన విధానంగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు.
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ఇండోర్ స్టేడియంలో బుధవారం విద్యార్థులతో ప్రత్యేకంగా నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఇతర జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యోగ ఎన్నో శతాబ్దాలుగా భారతీయుల జీవనశైలిలో భాగంగా కొనసాగుతోందన్నారు. యోగా ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించిన విదేశీయులు కూడా దానిని తమ జీవన విధానంగా మార్చుకున్నారని పేర్కొన్నారు.
యోగాను ఒకరోజు చేసి మానేయకుండా ప్రతిరోజూ కనీసం అరగంట నుంచి గంట సమయం కేటాయించి అభ్యాసం చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చన్నారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని తెలిపారు.
భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన యోగా సంపదను భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు యోగాను అలవాటు చేసుకుంటే ఒత్తిడిని నియంత్రించడంతో పాటు తమ వృత్తుల్లో మెరుగైన ఫలితాలు సాధించి సంతృప్తికరమైన జీవితం గడపగలరని చెప్పారు.
విద్యార్థి దశ నుంచే యోగాపై అవగాహన కల్పించి అభ్యాసం చేయిస్తే ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 19న పట్టిసీమలో భారీ స్థాయిలో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
యోగాంధ్ర కార్యక్రమంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీఆర్వో దేవకీదేవి, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, ఆర్టీవో లక్ష్మీప్రసన్న, డీపీవో జి. మల్లిఖార్జునరావు, జిల్లా ఆయుష్ అధికారి బి. భాస్కర్, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ. భానుప్రతాప్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, తహసీల్దార్ గాయత్రీదేవి, మెప్మా పీడీ రాజబాబు, ఇన్‌చార్జ్ డీఎస్ఓ ప్రతాప్, పౌర సరఫరాల శాఖ జీఎం శివరామమూర్తి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సయ్యద్ అబ్దుల్ అజీజ్, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
