ఒత్తిడికి ఔషధం..

ఒత్తిడికి ఔషధం..
పోలీస్ సిబ్బందికి ధ్యాన శిక్షణ..
భీమవరం, ఆంధ్రప్రభ : పోలీస్ విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం ఒక దివ్యౌషధమని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు పేర్కొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా ‘హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్’ శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ల పరిధిలోని పోలీస్ అధికారులకు, సిబ్బందికి మూడు రోజుల పాటు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్ని భీమవరం డీఎన్ఆర్ కళాశాల ఆవరణలోని రామకృష్ణ భవన్‌లో ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ.. ధ్యానం ద్వారా ఒత్తిడి నియంత్రణ సాధ్యమవుతుందని, ఏకాగ్రత పెంపొందుతుందని తెలిపారు. ఇది వ్యక్తిగత జీవితంతో పాటు విధి నిర్వహణలో కూడా సహాయపడుతుందని చెప్పారు.
శిక్షణను ప్రతి సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎం.వి.వి. సత్యనారాయణ పాల్గొన్నారు.
హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ఆకుల స్వామి, ఆర్‌పీ కె. రాజేష్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక ధ్యాన తరగతులు నిర్వహించారు. శ్వాసక్రియలు, ఏకాగ్రత పెంపొందించే విధానాలు, ఒత్తిడిని తగ్గించే వ్యాయామాలపై శిక్షణ అందించారు.
ఈ కార్యక్రమంలో భీమవరం వన్ టౌన్, టూ టౌన్, రూరల్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు, ఆకివీడు ఇన్‌స్పెక్టర్, మహిళా ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సహా ఎస్సైలు, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది, హోమ్ గార్డులు పాల్గొన్నారు.
